Wednesday, December 25, 2024

గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అవినీతి

  • మొదటి విడతలో కింది నుంచి పైస్థాయి వరకు అవినీతి…
  • రెండోవిడతలో పైస్థాయి అధికారులకు మాత్రమే లబ్ధి..
  • అప్పటి ఒక మంత్రితో పాటు సిఎంఓ అధికారులకు ముడుపులు
  • ముగ్గురు డైరెక్టర్‌లో ఒకరు అరెస్టు, ఒకరి మృతి, మరోకరు పరారీ

గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అవినీతి చోటుచేసుకుంది. రెండు విడతల్లో జరిగిన గొర్రెల పంపిణీలో ఈ అవినీతి అంతకంతకు పెరిగిపోవడం గమనార్హం. అయితే మొదటి విడత గొర్రెల పంపిణీలో కిందిస్థాయి (డాక్టర్‌ల) నుంచి పైస్థాయి అధికారుల వరకు కమీషన్‌లు ముట్టగా రెండో విడతలో మాత్రం పైస్థాయి అధికారులకు మాత్రమే ఈ ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటి, రెండో విడత గొర్రెల పంపిణీ పథకంలో ముగ్గురు పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌లకు సంబంధం ఉండగా అందులో ఒక మాజీ డైరెక్టర్ గుండెపోటుతో మృతిచెందగా మరో డైరెక్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, మూడో డైరెక్టర్‌ను ఏసిబి అధికారులు అరెస్టు చేశారు. ఇలా గొర్రెల పంపిణీ పథకం కొనుగోళ్ల నుంచి లబ్ధిదారులకు అందచేసేంత వరకు వివాదాస్పదంగా మారడం గమనార్హం. అయితే రెండోవిడత గొర్రెల పంపిణీ పథకంలో అప్పటి మంత్రికి ఈ కేసుతో సంబంధం ఉండడంతో కిందిస్థాయిలో డాక్టర్‌లకు రూ.10 వేలు మాత్రమే ముట్టడంతో ఈ అవినీతి బయట పడిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

గొర్రెల పంపిణీ కోసం రూ.4 వేల కోట్లు లోన్
గత ప్రభుత్వం హయాంలో 2017, జూన్ 20వ తేదీన గొల్లకురుమల కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని తెలంగాణలో ప్రారంభించింది. మొత్తం రెండు విడతల్లో 7.31 లక్షల మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా లబ్ధిదారుల కోసంనేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సిడిసి) నుంచి రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రూ.4 వేల కోట్లు లోన్ తీసుకుంది. మరో వెయికోట్లను లబ్ధిదారుల దగ్గరి నుంచి డిడిల రూపంలో రూ.43,750 రాష్ట్ర ప్రభుత్వం కట్టించుకుంది. అనంతరం రెండు విడతలుగా గొర్రెలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ రెండు విడతల్లో సుమారుగా 3,86,830 మంది లబ్ధిదారులకు (81.23 లక్షల గొర్రెలను) ప్రభుత్వం పంపిణీ చేసింది. సుమారుగా రూ. 5 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇంకా 3,37,816 మంది లబ్ధిదారులకు గొర్రెలు అందాల్సి ఉంది. ప్రస్తుతం డిడిలు కట్టిన 80 వేల మంది లబ్ధిదారులు ఒక్కోక్కరు రూ.43,750ల చొప్పున కట్టి రెండేళ్లుగా గొర్రెల కోసం ఎదురుచూస్తున్నారు.

రెండో విడతలో పెరిగిన ధర
ఈ గొర్రెలను పక్క రాష్ట్రాల నుంచి తీసుకోవాలన్న నిబంధనల మేరకు ఎపి, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అధికారులు కొనుగోళ్లు చేశారు. అందులో భాగంగా లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ పథకం కిదం ఒక్క యూనిట్‌ను పంపిణీ చేశారు. ఒక్క యూనిట్‌ను అంటే (20 ఆడగొర్రెలు, ఒక పొటేలుతో కలిపి, రూ.1,25,000లు మొదటివిడతలో ప్రభుత్వం గొర్రెల కొనుగోలు కోసం ఖర్చు చేసి) లబ్ధిదారులకు అందచేశారు. రెండో విడతలో మాత్రం గొర్రెలకు సంబంధించి ఒక్కో యూనిట్ ధరను అదనంగా రూ.50 వేలను పెంచి (20 ఆడగొర్రెలు, ఒక పొటేలుతో కలిపి,రూ. 1,75,000లను గొర్రెల కొనుగోళ్ల కోసం అధికారులు చెల్లించారు.

మొదటి డైరెక్టర్ మృత్యువాత
అయితే ఈ రెండు విడతల పంపిణీలో పశుసంవర్ధక శాఖకు ముగ్గురు డైరెక్టర్‌లుగా పనిచేయడంతో పాటు వారు గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఎండిలు కొనసాగారు. ఆ సమయంలోనే అవినీతి భారీగా జరగడంతో ప్రస్తుతం ఏసిబి, ఈడీలు విచారణ చేపట్టాయి. అయితే మొదటి విడత పంపిణీలో అప్పటి డైరెక్టర్ గొర్రెల కొనుగోళ్లకు సంబంధించి ఎపితో పాటు వేరే రాష్ట్రానికి చెందిన వారితో ఒప్పందం చేసుకోవడంతో ఆ సమయంలో ఇబ్బందులు ఎదురుకావడం, వారు ఆ డైరెక్టర్‌పై ఒత్తిడి తీసుకురావడంతో ఆయన గుండెపోటుతో మృత్యువాత పడ్డారని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు.

మాజీ డైరెక్టర్ విదేశాలకు…
ఆయన మృతి అనంతరం మరో అధికారి ఆ పోస్టులో కొనసాగడంతో పాటు ఆయన హయాంలోనే ఎక్కువగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన డైరెక్టర్‌గా, ఎండిగా రిటైర్ అయినా అప్పటి సిఎంఓలో పనిచేసే ఓ ఉన్నతాధికారి మరో రెండేళ్ల పాటు ఆయన్ను అదే పదవిలో కొనసాగించేలా అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించినట్టుగా విమర్శలు వినిపించాయి. ఈ కేసుతో ఆ అధికారికి సంబంధాలు ఉండడంతో పాటు భారీగా ముడుపులు ముట్టచెప్పినందుకే ఆయనకు రెండేళ్ల పాటు ఎక్స్‌టెన్షన్ ఇప్పించినట్టుగా సమాచారం. ఇలా ఆ డైరెక్టర్ హయాంలోనే ఎక్కువగా అవినీతి జరిగిందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినా ఆయనపై అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా ఆయన రిటైర్‌మెంట్ అయినా రెండేళ్లపాటు అదే పదవిలో కొనసాగించడం విశేషం. ప్రస్తుతం ఆయన విదేశాలకు పారిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక ఆయన డైరెక్టర్‌గా, ఎండిగా బాధ్యతలు నిర్వర్తించిన రాంచందర్ నాయక్ ఈ కేసులో అరెస్టయి జైళ్లో ఉన్నారు.

ఈ పథకం మీద సమగ్ర విచారణ చేపట్టాలి
గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్
మొత్తం ఈ పథకం మీద సమగ్ర విచారణ చేపట్టాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో మూడు నెలల్లో అందరికీ గొర్రెలను ఇస్తామని వాగ్దానం చేసింది. కానీ, ఇప్పటికీ అతీగతీ లేదు. గతంలో జరిగినట్టు కాకుండా అవినీతి అక్రమాలకు తావులేకుండా యూనిట్ మొత్తం నగదు బదిలీ ద్వారా పథకాన్ని అమలు చేయాలి. గతంలో లబ్ధిదారులు ఇచ్చిన డిడిలను వాపస్ ప్రక్రియ నిలిపివేయాలి.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com