Wednesday, June 26, 2024

గొర్రెలు దొరక్క ఇబ్బందులు..?

  • ఒక లబ్ధిదారుడి నుంచి మరొకరికి అవే గొర్రెలు…
  • మొదటి, రెండో విడత పంపిణీలో ఇద్దరు డైరెక్టర్‌ల అనుచరులదే ముఖ్యపాత్ర
  • కోట్లలో వెనుకేసుకున్న ఆ ఇద్దరు

గొర్రెల పంపిణీ పథకంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పథకం 2017లో ప్రారంభమయినప్పటి నుంచి అన్నీ అక్రమాలే చోటుచేసుకున్నాయని ఎసిబి గుర్తించింది. రెండు విడతల్లో జరిగిన గొర్రెల పంపిణీలో ఈ అవినీతి అంతకంతకు పెరిగిపోవడం గమనార్హం. క్షేత్ర స్థాయిలో ఈ పథకం అమల్లోకి తీసుకురావాలని అప్పటి ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు ఒకేసారి అంత పెద్ద మొత్తంలో గొర్రెలు దొరక్కపోవడంతో చాలాచోట్ల నిజంగా గొర్రెలు కొనకుండా, కొంత రైతుకు ఇచ్చేసి, గొర్రెలు ఇచ్చినట్టుగా రాశారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ పద్ధతిలో గొర్రెలను ఒక ట్రక్కులో లబ్ధిదారుడి దగ్గరకు తీసుకువచ్చి అతనితో ఫొటోలు దిగి, ఆ గొర్రెలు ఇవ్వకుండా డబ్బులను ఇచ్చారని ఆ తరువాత ఆ గొర్రెలను మరో లబ్ధిదారుడి దగ్గరకు తీసుకెళ్లారని కాగ్ గుర్తించింది.

ఈ పద్ధతిలో లబ్ధిదారుడికి కూడా ఎంతోకొంత ముట్టచెప్పడంతో ఇన్ని రోజులు అది బయటకు రాలేదని సమాచారం. ఇక 2018 నుంచి 2020ల మధ్య చనిపోయిన 20 మంది రైతులకు 2021లో గొర్రెలు ఇచ్చినట్లు అధికారులు లెక్కలు రాశారు. వాళ్లు చనిపోయారని ప్రభుత్వమే ఆ కుటుంబాలకు బీమా కూడా ఇచ్చింది. దీంతోపాటు గొర్రెలకు వేసే ట్యాగుల్లో కూడా అధికారులు లెక్కలేనన్నీ తప్పులు చేశారు. కాగ్ లెక్కల ప్రకారం దక్షిణ తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 96 వేల యూనిట్ల పంపిణీ అని లెక్కల్లో చూపగా వాస్తవానికి 29 వేల యూనిట్లే ఇచ్చినట్టు తన నివేదికలో కాగ్ పేర్కొనడం విశేషం.

మొదటి విడతలో అప్పటి డైరెక్టర్ అనుచరుడే ముఖ్య పాత్రదారి….
అయితే 2017లో ఈ పథకం ప్రారంభం అయినప్పుడు అప్పటి డైరెక్టర్ వివిధ రాష్ట్రాల్లోని కొందరితో గొర్రెల కొనుగోలు కోసం ఒప్పందం చేసుకొని వారి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈతతంగం మొత్తం ఆ డైరెక్టర్ అనుచరుడు (ఏడి) దగ్గరుండి చూసుకున్నారని, అప్పట్లో ఆ డైరెక్టర్‌ను కలవాలంటే ఆ ఏడిని ముందుగా ప్రసన్నం చేసుకుంటేనే పనులు అయ్యేవని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

మొదటివిడత గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకల్లో ఆ ఏడి రైతులకు, డైరెక్టర్‌కు మధ్యవర్తిత్వం వహించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎపి నుంచి ఎక్కువగా గొర్రెలను కొనుగోలు చేయడానికి ఆ ఏడి ఆసక్తి చూపారని అలా ఆయన కోట్లలో వెనకేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సమయంలో అప్పటి డైరెక్టర్‌కు ముడుపులు ఇప్పించడంతో పాటు ఆ ఏడి కూడా భారీగా లబ్ధిపొందారని ఆ విషయం అప్పటి ప్రభుత్వానికి తెలియడంతో ఆ డైరెక్టర్ గుండెపోటుతో మృతిచెందారని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు.

డాక్టరే ముఖ్యపాత్రదారి
ఈ డైరెక్టర్ మృతి అనంతరం బాధ్యతలు చేపట్టిన మరో డైరెక్టర్ హయాంలో గొర్రెల పంపిణీలో భారీగా అవినీతి జరిగిందని అధికారులు గుర్తించారు. ఈ డైరెక్టర్ ప్రస్తుతం విదేశాలకు పారిపోగా ఈయన దగ్గర పనిచేసిన ఓ డాక్టర్ అప్పట్లో ఈ వ్యవహారంలో ముఖ్యపాత్ర పోషించారని ఏసిబి గుర్తించింది. ఈ డాక్టర్ అప్పటి డైరెక్టర్‌కు ముఖ్య అనుచరుడిగా కొనసాగగా, ఆ శాఖలో ఏదైనా పనికావాలంటే ముందుగా ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలని, ప్రసన్నం చేసుకున్న వారికే పనులు జరిగాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

గొర్రెల పంపిణీ నుంచి శాఖలో జరిగిన ప్రతి కాంట్రాక్ట్‌కు ఈ డాక్టర్ ముడుపులు వసూల్ చేసి ఆ డైరెక్టర్‌కు ముట్టచెప్పు వారని, అలా నాలుగైదు సంవత్సరాల పాటు వారిద్దరూ ఈ శాఖలో తమ ఇష్టానుసారంగా దోచుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ డాక్టర్ చివరకు పశుసంవర్ధక శాఖ టెండర్‌లు వేయడానికి తీసుకొచ్చిన మిషనరీలను సైతం రాత్రి సమయంలో ఆటోల్లో తరలించారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇలా గొర్రెల పంపిణీ పథకంలో అనేక అక్రమాలను ఈ ఇద్దరు డైరెక్టర్‌లు చేశారని వారి తరువాత వచ్చిన రాంచందర్ నాయక్ సైతం దానిని కొనసాగించారని, ప్రస్తుతం ఆయన్ను ఏసిబి అధికారులు అరెస్టు చేయడంతో గతంలో జరిగిన అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయని ఉద్యోగులు పేర్కొనడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?

Most Popular