Saturday, November 16, 2024

రాష్ట్రంలో బీరు ప్రియులకు షాక్..!

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నోస్టాక్ బోర్డులు
బీర్ల కంపెనీలకు బకాయిల చెల్లింపుల్లో ఎక్సైజ్ ఆలస్యం
బీర్ల కంపెనీకి భారంగా మారిన నీటి కొరత సైతం
ఉత్పత్తిని తగ్గించిన బీర్ల కంపెనీలు

రాష్ట్రంలో బీరు ప్రియులకు షాక్ తగిలింది. మద్యం కంపెనీలకు పాత బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం ఆలస్యం చేయడంతో చాలా కంపెనీలు బీర్ల సరఫరాను తగ్గించేశాయి. ఇప్పటికే రూ.1,000 కోట్ల బకాయిలు ఉన్నాయని యజమానులు వాపోతున్నారు. దీంతోపాటు మండుతున్న ఎండలు, నీటి కరువుతో రాష్ట్రంలో బీర్ల తయారీకి ఇబ్బందులు ఎదురయ్యాయని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పదిహేను రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడంతో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల వైన్స్, బార్‌లలో బీరు నో స్టాక్ అనే బోర్డులు దర్శనమిస్తుండటం విశేషం. ఈ వార్త బీరు ప్రియులను కలవరపెడుతోంది.

రూ.1,000 కోట్ల బకాయిలు..
తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఆలస్యం కావడంతో చాలా మద్యం కంపెనీలు బీర్ల సరఫరాలను తగ్గించినట్టుగా తెలిసింది. మద్యం తయారీ కంపెనీలు, బ్రూవరీలు, డిస్ట్రిబ్యూటర్లకు రూ.1,000 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖ ఇటీవల రూ.100 కోట్లు మాత్రమే చెల్లించిందని, అది కూడా రెండు కంపెనీలకు మాత్రమే చెల్లించడంతో చాలా కంపెనీలు బీర్లను పంపేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

రూ.100 కోట్లు మాత్రమే చెల్లింపు
కొన్ని నెలలుగా బీర్ల తయారీదారులు పాత బకాయిలను క్లియర్ చేయాలని ఎక్సైజ్ శాఖకు అనేక విజ్ఞప్తులు చేసినట్టుగా సమాచారం. అయినా ఎక్సైజ్ శాఖ సుమారు రూ.100 కోట్లను మాత్రమే వారికి చెల్లింపులు చేశాయని, దీంతో విసుగు చెందిన బీర్ల తయారీదారులు కొన్ని నెలలుగా బీర్ల సరఫరాను తగ్గించినట్టుగా తెలిసింది. నిజానికి వేసవికాలంలోనే అత్యధికంగా అమ్ముడే పోయే బీర్ల సరఫరా ఆగిపోవడంపై వైన్స్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీర్ల అమ్మకాలు తగ్గితే తమ ఆదాయానికి గండి పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.

1999లో ఒకసారి ఎదురైన స్వల్ప ఆటంకం వల్ల…….
మూడు నెలలుగా బీర్ల వినియోగం పెద్ద ఎత్తున నమోదవుతోంది. ఈ మధ్య కాలంలో 48,71,668 పెట్టెల బీర్ల విక్రయాలతో దాదాపు రూ.1,458 కోట్ల రాబడిని ఆబ్కారీ శాఖ నమోదు చేసుకుంది. రానున్న రెండు, మూడు నెలలు నీటి కష్టాలతో బీర్ల తయారీపై పెను ప్రభావం పడనున్నట్టుగా సమాచారం.1999లో ఒకసారి ఎదురైన స్వల్ప ఆటంకం వల్ల బీర్ల ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని సింగూరు లాశయం నుంచి నామమాత్రపు ధరకే రోజుకు 44 లక్షల లీటర్ల నీటిని బీర్లు ఉత్పత్తిచేసే నాలుగు మల్టీ నేషనల్ బ్రేవరేజీలకు జలమండలి నీటిని సరఫరా చేస్తోంది. ఎస్‌ఏబి మిల్లర్ ఇండియాకు 15 లక్షల లీటర్లు, యునైటెడ్ బ్రూవరీస్, మల్లేపల్లికి 12 లక్షల లీటర్లు, యునైటెడ్ బ్రూవరీస్, కొత్లాపూర్ 05 లక్షల లీటర్లు, క్రౌన్ ఇండియాకు 5 లక్షల లీటర్లు, కార్సెర్గ్ ఇండియాకు 7 లక్షల లీటర్ల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో ప్రతినెలా 40 నుంచి 60లక్షల పెట్టెల బీరు విక్రయాలతో పాటు మరో 13 లక్షల పెట్టెల బీరు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఇందుకుగాను సింగూరు, మంజీరా జలాశయాల నుంచి 44 లక్షల లీటర్ల నీరు ఆయా బ్రేవరేజీలకు అవసరం పడుతోంది.

ట్యాంకర్ల ద్వారా బీర్ల కంపెనీకి నీటి సరఫరా
మంజీరా నుంచి చుట్టు పక్కల ఉన్న ప్రధానమైన నాలుగు బీర్ల కంపెనీలకు ప్రస్తుతం జలమండలి బల్క్‌గా నీటిని సరఫరా చేస్తోంది. రోజుకు 44 లక్షల లీటర్ల వరకు ఈ కంపెనీలకు నీళ్లు అవసరం. మొత్తం సరఫరాలో చూసుకుంటే చాలా తక్కువే అయినా నగరానికి పూర్తి స్థాయిలో నీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీలకు కొంత జలమండలి కోత వేసినట్లుగా సమాచారం. దీంతో ఆ ప్రభావం బీర్ల సరఫరాపై పడినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయా బీర్ల కంపెనీలు సైతం ట్యాంకర్లపై ఆధారపడడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular