అమెరికాలోని మిల్వాకీ కౌంటీ విస్కాన్సిన్ రాష్ట్రం మిల్వాకీ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన 27 ఏళ్ల ప్రవీణ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ప్రవీణ్ స్పాట్‌లోనే తుదిశ్వాస విడిచాడు. దీంతో సమాచారం అందుకున్న అతడి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవీణ్ మృతితో గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. ప్రవీణ్ అమెరికాలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతూ, పార్ట్-టైమ్ ఉద్యోగం చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో అమెరికాలో భారతీయ విద్యార్థులు కాల్పుల ఘటనల్లో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. మూడు నెలల క్రితం, ఖమ్మం జిల్లాకు చెందిన సాయితేజ చికాగోలో దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా, నెల క్రితం హైదరాబాద్‌కు చెందిన రవితేజ కూడా కాల్పుల్లో మరణించారు. ఈ ఘటనలు అమెరికాలో నివసిస్తున్న తెలుగు విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.