Sunday, October 6, 2024

రోజుకు 2లక్షల 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరపాలి

  • ఓపెన్ కాస్ట్ లో ఉన్న నీటిని పూర్తిగా తొలగించాలి
  • రోజుకు 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలి
  • అన్ని ఏరియాలో జనరల్ మేనేజర్లకు సింగరేణి సిఎండీ ఎన్.బలరామ్ ఆదేశం

వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో నిర్దేశిత వార్షిక ఉత్పత్తి లక్ష్యాలు సాధించడం కోసం ఇకపై రోజుకు కనీసం రెండు లక్షల పదివేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా జరపాలని, 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను తొలగించాలని సింగరేణి సిఎండీ ఎన్.బలరామ్ ఆదేశించారు. శనివారం ఆయన హైదరాబాద్ సింగరేణి భవన్ నుండి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బొగ్గు ఉత్పత్తి, రవాణాపై సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇంకా పెద్ద ఎత్తున నిలువ ఉన్న నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని, అవసరమైతే అదనపు పంపులు వినియోగించాలని ఆదేశించారు. తద్వారా నిర్దేశిత ఓవర్ బర్డన్ తొలగింపు, బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించడం సాధ్యమవుతుందన్నారు. అన్ని ఏరియాల జీఎంలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

అలాగే బొగ్గు నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, వినియోగదారుల విశ్వాసాన్ని మరింతగా చూరగొనాలని సూచించారు. ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన నైనీ బొగ్గు బ్లాక్, వీకే ఓపెన్ కాస్ట్, రొంపేడు ఓపెన్ కాస్ట్, గోలెటి ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించి ప్రాథమిక అటవీ పర్యావరణ అనుమతులను సాధించటం జరిగిందని కనుక గనుల ప్రారంభానికి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు ప్రతి ఏరియా సాధించిన ఉత్పత్తి లక్ష్యాలను సమీక్షించారు. ఇప్పటికే అర్థ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మిగిలిన తెరిపి కాలంలో ఇచ్చిన లక్ష్యాలను దాటి ఉత్పత్తులు సాధించాలన్నారు.

ఏరియా జనరల్ మేనేజర్లు సూచించిన కొన్ని సమస్యలపై తక్షణమే స్పందిస్తూ వాటి పరిష్కారం కోసం వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు, జి.వెంకటేశ్వర రెడ్డి, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎస్.డి.ఎం.సుభాని, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ రవిప్రసాద్, జనరల్ మేనేజర్ సి. పి. పి పి.రవికుమార్, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, వివిధ విభాగాల కార్పొరేట్ జనరల్ మేనేజర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular