జులై 20న మొదలు కానున్న కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు
272 ఎక్స్టర్నల్ పోస్టులకు 18,665 మంది పోటీ
తొలిసారిగా సింగరేణిలో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు
హైదరాబాద్ లో 12 కేంద్రాల్లో పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు
పరీక్షకు ముందు, తర్వాత అభ్యర్థుల బయోమెట్రిక్ నమోదు
పరీక్షకు అర గంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేత
మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి
సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్
సింగరేణి సంస్థ లో గత మార్చి నెల 1న విడుదల చేసిన ఉద్యోగ ప్రకటన లో భాగంగా మొత్తం 10 కేటగిరీలలో 272 ఎక్స్టర్నల్ పోస్టుల భర్తీకి హైదరాబాద్ కేంద్రంగా ఈనెల 20, 21వ తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు సంస్థ ఛైర్మన్ , ఎండీ ఎన్.బలరామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 18,665 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లను జారీ చేసినట్లు వెల్లడించారు. అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలన్న ఉద్దేశంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలను(సీబీటీ) నిర్వహిస్తున్నట్లు వివరించారు. పోటీ పరీక్షల నిర్వహణలో విశేష అనుభవం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ డి సి ఐ ఎల్ వారి ఆధ్వర్యంలో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం హైదరాబాద్ జంట నగరాల్లో 12 పరీక్ష సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
అలాగే మోసగాళ్ల వలలో పడొద్దని, శ్రమను నమ్ముకొని పరీక్షలో విజయం సాధించాలని సూచించారు. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసగించాలని చూస్తే వారి వివరాలను కంపెనీ విజిలెన్స్ విభాగం, పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యం అభ్యర్థులకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. అభ్యర్థులు ఒకరోజు ముందే తమ సెంటర్లు ఎక్కడ ఉన్నాయనేది తెలుసుకోవాలి. పరీక్షకు గంటన్నర ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు.
అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటోలు తీసుకురావాలి. పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల పరీక్షకు ముందు, తర్వాత వారి బయోమెట్రిక్ వివరాలు సేకరించడం జరుగుతుంది. అడ్మిట్ కార్డులో తెలిపిన సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినట్లైతే హెల్ప్ డెస్క్ నెం. 08744-249992 ను సంప్రదించవవచ్చు.