90 రోజుల్లో సమగ్ర నివేదిక
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సీఐడీ అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేపట్టనుంది. సిట్ బృందంలో ఐజీ రమేశ్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఇప్పటికే పంజాగుట్టతో పాటు సైబరాబాద్, మియాపూర్ పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను కూడా ప్రభుత్వం సిట్‌కు బదిలీ చేసింది. దీనిపై 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని సిట్‌కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
నమ్మి బెట్టింగ్ పెట్టి
ఇంటర్వ్యూలు, సరదా వీడియోలతో సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకుంటున్న ఇన్‌ఫ్లూయెన్సర్లు పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. వీరి కంటెంట్ నచ్చి ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లకు ప్రచారం చేయడం సమస్యగా మారుతోంది. వీరిని ఫాలో అవుతున్న సామాన్య ప్రజలు బెట్టింగ్స్ పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌పై గతంలోనే నిషేధం విధించింది. ఆన్‌లైన్ గేమ్‌లు ఆడినా ప్రోత్సహించినా శిక్షార్హులు అవుతారు. ఆన్‌లైన్, సోషల్ మీడియాలో బెట్టింగ్‌కు ప్రచారం కల్పించడం, వాటిని ప్రోత్సహించడం నిషేధం. ఈ నిబంధనలను ఉల్లంఘించి ప్రచారం చేస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం- 2019 కింద కేసులు నమోదు చేస్తారు.