నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంట శివారులో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ పైకప్పు కూలిన దుర్ఘటన జరిగి సరిగ్గా నెల రోజులైంది. ఫిబ్రవరి 22వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. సొరంగంలో చిక్కుకున్న 8 మంది సిబ్బందిలో గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహం మాత్రమే కొద్ది రోజుల క్రితం లభ్యమైంది. మిగతా 7 మందిని గుర్తించేందుకు దేశంలోని అత్యుత్తుమ ఏజెన్సీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ పురోగతి కనిపించట్లేదు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదం దేశంలోనే అరుదైనదిగా నిపుణులు చెబుతున్నారు. సొరంగంలో 13.85వ కిలోమీటరు వద్ద పైకప్పు కూలింది. మట్టి, రాళ్లు, బురద, సీసీ సెగ్మెంట్స్, నీరు, టీబీఎం శిథిలాలన్నీ టన్నెల్‌లోని 11వ కి.మీ.నుంచి 13.85 కి.మీ. వరకు పేరుకుపోయాయి. నిమిషానికి 5 వేల లీటర్ల నీటి ఊట వస్తుండటంతో మట్టి తడిసి చాలా గట్టిగా మారింది. తవ్వాల్సిన మట్టి గట్టిగా ఉండటంతో పాటు పైకప్పు బలహీనంగా ఉండటంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. దేశంలోనే అత్యుత్తమ కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల బృందాలు దాదాపు 1000 మందితో మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పని చేస్తున్నాయి. అయినప్పటికీ పురోగతి కనిపించడం లేదు.