ఇటీవల ప్రమాదం జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టులో బీఆర్ఎస్ హయాంలో ఏ పనులు జరగలేదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తే ఎమ్మెల్యేగా తాను రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం ప్రాజెక్టులో ఎలాంటి పనులు జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టులో పనులు జరగలేదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని.. నిరూపించలేకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. ఓ వైపు కులగణనపై గందరగోళం సృష్టిస్తూ అన్ని సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. 10 రోజులు గడుస్తున్నా టన్నెల్ లోపల గల్లంతైన వారి జాడ సైతం కనిపెట్టలేకపోవడం దారుణం అన్నారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణలో లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించారు. కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసి సాగునీరు అందించాం. పలు ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి లక్షల ఎకరాలు తడిపిన ఘనత కేసీఆర్ దేనని హరీష్ రావు, కేటీఆర్ చెబుతున్నారు. కేసీఆర్ ప్రతిష్ట ను దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లి పరిశీలించారు. రెస్క్యూ టీమ్ ను, అధికారులను సహాయక చర్యల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే రోబోలను రంగంలోకి దించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గత బీఆర్ఎస్ హయాంలో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని, ఉత్తర తెలంగాణతో పోల్చితే ఇక్కడి ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏపీకి కృష్ణా జలాల తరలింపుపై సంతకాలు చేశారు.. కానీ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్గొండకు సాగునీరు, తాగునీరు ఇవ్వడాన్ని నిర్లక్ష్యం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పాలకులు చేసిన పాప ఫలితమే ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదమని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ తీవ్రంగా స్పందించారు. పాలన చేతకాక తమపై విమర్శలు చేయడం సరికాదని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మండిపాటు..
‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. SLBC టన్నెల్ లో ప్రమాదం జరిగిన తరువాత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు రోజుల సమయం ఇచ్చిన తరువాత సందర్శనకు వచ్చింది. కానీ ప్రతిపక్ష నేతలను ఘటనా స్థలాన్ని సందర్శించకుండా అడ్డుకున్నారు. ఎస్ఎల్‌బీసీని తన బ్రెయిన్ చైల్డ్ గా చెప్పుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుబాయ్ టూర్ వెళ్లి తీరిగ్గా వచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రశాంతంగా చేపల కూర వండించుకుని తిన్నారు. 8 మంది లోపల చిక్కుకుపోయిన ప్రాంతాన్ని మంత్రులు, కాంగ్రెస్ నేతలు టూరిస్ట్ స్పాట్ గా మార్చుకున్నారు’ అని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ దుమారం రేపుతోంది.