రెడియాలజీ విభాగంలో ఒక్కసారిగా కలకలం
ఎంజీఎం హాస్పిటల్‌లో పాము కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం రేడియాలజీ విభాగం(రూమ్ నంబర్ 92) లో పాము ప్రత్యక్షం కావడంతో రోగులు, సిబ్బంది ఒక్కసారిగా పరుగులు తీశారు. ఓపీ సేవలు కొనసాగే సమయం కావడంతో రేడియాలజీ విభాగంలో రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇదే సమయంలోనే పాము కనిపించడంతో కొంత సేపటి వరకు రోగులు, సిబ్బంది లోపలికి వెళ్లేందుకు భయపడ్డారు. సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది పాముని గుర్తించి పట్టుకొని, అనంతరం నిర్జన ప్రదేశానికి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎంజీఎం హాస్పిటల్ ఆవరణ పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో పాములకు ఆవాసంగా మారడంతో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయని, గతంలో వరుస రెండు దినాల్లో రెండు పాములు వార్డుల్లో కనిపించడం వ్యవస్థ పనితీరును చూపిస్తుందని, అధికారులు స్పందించి శానిటేషన్ వ్యవస్థను మెరుగుపరచినట్లయితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని రోగులు, సిబ్బంది భావిస్తున్నారు.