అడుగు బయటపెడితే చాలు కాటు వేస్తున్నాయి.. ఆసుపత్రి పాలు చేస్తున్నాయి. చిత్తూరు జిల్లా బైరెడ్డి పల్లె మండలం కుమ్మరగంటకు చెందిన 50 ఏళ్ల సుబ్రమణ్యం దీన గాధ ఇది. కూలి పనులకు వెళ్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. కానీ పాములు పగబట్టాయి. 20 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడు తొలిసారి పాము కాటుకు గురై ఆసుపత్రిలో చేరాడు. వైద్యం అనంతరం కోలుకుని బయటపడ్డాడు.
ఆ తర్వాత కూడా పాములు అతడి వెంటపడుతూనే ఉన్నాయి. ఏడాదికి నాలుగైదుసార్లు పాము కాటు వేయడం.. ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుని బయటపడడం అతడికి అలవాటుగా మారింది. పాము కాట్ల నుంచి బయటపడేందుకు సర్పదోష నివారణ, రాహుకేతు పూజలు, పరిహారాలు వంటివి చేసినా ఫలితం లేకుండా పోయింది. పాములు తనను వదలకపోవడంతో అతడే పదేళ్ల క్రితం బెంగళూరు వలస వెళ్లాడు. అక్కడ భవన నిర్మాణ, మట్టిపనులు చేస్తుండేవాడు. అయితే, అక్కడ కూడా అతడిని పాములు వదల్లేదు. వైద్యం చేయించుకుని బయటపడ్డాడు. దీంతో తిరిగి స్వగ్రామం చేరుకుని ఓ కోళ్ల పరిశ్రమలో పనికి కుదిరాడు. రెండ్రోజుల క్రితం పొలం పనులకు వెళ్లి వస్తుండగా మరోమారు పాము కాటేసింది. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. పాము కాటేయడం, ఆసుపత్రిలో చేరడం పరిపాటిగా మారడంతో వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోందని, తన సంపాదనంతా వైద్యానికే సరిపోతోందని సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశాడు. మరి దీనికి ఏమి చేయాలో అర్ధం కానీ అతడిని ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటుందేమో చూడాలి మరి.