పొద్దంతా కాయకష్టం చేసే కూలీలు.. సాయంత్రానికి కల్లు తాగేందుకు కల్లు దుకాణానికి వెళ్తుంటారు. అక్కడ ఓ సీసా కల్లు తాగి.. ఇంటికి వెళ్లిపోతారు. అయితే అలా కల్లు తాగేందుకు కల్లు దుకాణానికి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని ఘటన ఎదురైంది. తాను తీసుకున్న కల్లు సీసాను తాగేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ సీసాలో కట్ల పాము ప్రత్యక్షమైంది.
దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆ వ్యక్తి తాగిన రెండు బుక్కల కల్లును నోట్లో నుంచి బయటకు ఉమ్మేశాడు. అతనికి ప్రాణాపాయం కూడా తప్పింది. గుటగుట కల్లు తాగి ఉంటే అతను ప్రాణాలు కోల్పోయేవాడు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు కల్లు దుకాణంపై దాడి చేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి గ్రామంలో గురువారం రాత్రి వెలుగు చూసింది.
అయితే స్థానికులు ఆగ్రహానికి గురైన తర్వాత కూడా ఆ కల్లు దుకాణం యజమాని నిర్లక్ష్యం వహించాడు. జనాలకు కల్లు విక్రయిస్తూ.. బాధితుల మాటలను వినిపించుకోలేదు. తమ ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లు నింపే క్రమంలో పరిశుభ్రత పాటించాలని స్థానికులు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.