Saturday, December 28, 2024

మా సమస్యలను పరిష్కరించండి

మీడియా అకాడమీ చైర్మన్‌కు మహిళా జర్నలిస్టుల వినతి

సమస్యలను పరిష్కరించాలని -మీడియా అకాడమీ చైర్మన్‌కు మహిళా జర్నలిస్టుల వినతిపత్రం సమర్పించారు. మీడియా సంస్థల్లో వృత్తి పరంగా మహిళా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియూడబ్ల్యూజే) మహిళా సంక్షేమ కమిటీ చైర్మన్‌కు విజ్ఞప్తి చేసింది. గురువారం బిఆర్‌కె భవన్‌లో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని మహిళా ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లింది. ప్రతి మీడియా సంస్థలో మహిళలకు 33 శాతం అక్రెడిటేషన్లు ఇవ్వాలన్న నిబంధన ఉన్నప్పటికీ పలు మీడియా సంస్థలు దానిని అమలు చేయడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా జర్నలిస్టులకు తమ వాటా ప్రకారం అక్రెడిటేషన్లు ఇచ్చే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని వారు కోరారు.

ప్రతి మీడియా సంస్థలో ఇంటర్నల్ కంప్లెంట్స్ కమిటీ ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ అది కూడా అమలు కావడం లేదని వారు తెలిపారు. విశాఖ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రతి మీడియా సంస్థలోనూ జెండర్ సెన్సిటివిటీ వర్క్ షాప్స్ జరగాలన్న నిబంధన కూడా కాగితాలకే పరిమితమైందన్నారు. ఇప్పటినుంచైనా విశాఖ గైడ్‌లైన్ ప్రతిచోటా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. ఐసిసి గైడ్‌లైన్స్ పాటించని సంస్థలకు అక్రెడిటేషన్లు ఇవ్వరాదన్న నిబంధనను తీసుకురావాలన్నారు. ఐసిసిలో ఇచ్చే ప్రతి ఫిర్యాదు మీడియా అకాడమీ దృష్టికి తీసుకువచ్చేలా అకాడమీ ఆవరణలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. తమ సంస్థలో పని చేస్తున్న మహిళా ఉద్యోగుల జాబితాను ప్రతి మీడియా సంస్థ కచ్చితంగా ఆరు నెలలకోసారి మీడియా అకాడమీకి సమర్పించేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఇళ్ల స్థలాల కేటాయింపులోనూ మహిళా జర్నలిస్టులకు 33 శాతం రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేయాలని, అక్రెడిటేషన్‌లతో సంబంధం లేకుండా మహిళా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని వారు సూచించారు. ఆయా మీడియా సంస్థలు పూర్తి స్థాయి మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంపును ఆరు నెలలకోసారి నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. మహిళా జర్నలిస్టుల సమస్యలపై చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఈ ప్రతినిధి బృందంలో టియూడబ్ల్యూజే మహిళా సంక్షేమ కమిటీ బాధ్యులు కళ్యాణం రాజేశ్వరీ, అత్తలూరి అరుణ, అజితా, వంగ యశోద, సూర్యకుమారి, ప్రతిభ, సాజిదా బేగంలు ఉన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com