అశాంతిని సృష్టించేందుకు కొందరు యత్నం: సిపి సీవీ ఆనంద్
హైదరాబాద్ నగరంలో నెల రోజులపాటు ఆంక్షలు విధిస్తున్నామం టూ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తు న్నాయని విశ్వసనీయ సమాచారం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 28 సాయంత్రం ఆరు గంటల వరకు నెల రోజులపాటు నగరంలో సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు.
ఎక్కడైనా ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బిఎన్‌ఎస్ సెక్షన్ 163 (పాత సీఆర్పీసీ 144 సెక్షన్) కింద ఆంక్షలు విధించినట్లు ఆదేశాల్లో వివరించారు. ఇటీవల సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ గుడిపై దాడి ఘటన తర్వాత అల్లర్లు రేగిన సంగతి విదితమే. దీనికి తోడు గ్రూప్-1 విద్యార్థులు, మూసీ నిర్వాసితులు, బెటాలియన్ పోలీసుల వరుస ఆందోళనలతో హైదరాబాద్‌లో పోలీసులకు శాంతిభద్రతల నిర్వహణ సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ తాజా ఆంక్షలు విధించినట్లు సమాచారం.
సచివాలయం వద్ద 144 సెక్షన్ అమలు
తెలంగాణ సచివాలయపరిధిలో ఆంక్షలు విధించారు. ముట్టడి చర్యలతో అప్రమత్తమైన ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సచివాలయ భద్రతా సిబ్బందికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం చుట్టూ 2 కి. వరకు 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. సిబ్బంది కదలికలు, సోషల్ డియాపై నిఘా ఉందన్నారు. పోలీసు అధికారులపై రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ కావాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం, పోలీసు శాఖకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు షేర్, లైక్ చేయొద్దన్నారు. తప్పు జరిగితే వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.