Saturday, December 28, 2024

చిక్కుల్లో సోమేశ్‌

భూమిని తారుమారు చేశార‌ని ఫిర్యాదులు
ఈడీకి ఫిర్యాదు చేసిన బాధితులు
ఇప్ప‌టికే జీఎస్టీ కుంభ‌కోణంలో మాజీ సీఎస్‌
తాజాగా ఇద్ద‌రు ఐఏఎస్‌ల‌తో పాటుగా సోమేశ్‌పై కంప్లైంట్‌

బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హయాంలో అంతా తానై అధికార యంత్రాంగాన్ని న‌డిపించిన మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వ‌రుస‌గా చిక్కుల్లో ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు కేసుల్లో ఆయ‌న ఇరుక్కున్నారు. తాజాగా కొండాపూర్ లో ఓ భూ వివాదం వ్య‌వ‌హారంలో సోమేశ్ కుమార్ మీద ఈడీకి ఫిర్యాదు అందింది. ఇద్ద‌రు ఐఏఎస్‌ల‌తో స‌హా సోమేశ్ పేరును బాధితులు చేర్చారు. ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, అమోయ్ కుమార్ తో పాటుగా మాజీ సీఎస్‌ సోమేశ్ కుమార్‌పై ఈడీకి ఫిర్యాదు అందింది. కొండాపూర్‌లోని తమ 42 ఎకరాల భూమిని జీవో 45 జారీ చేసి నకిలీ పత్రాలతో భూపతి అసోసియేట్స్‌కు ఇచ్చారని బాధితులు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఇప్ప‌టికే అమోయ్‌‌ను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే.
భూదాన్ భూముల‌ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల దృష్ట్యా ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ను ఈడీ విచారిస్తున్నది. తాజాగా మరో మ‌రో ఇద్ద‌రు అధికారులపై ఈడీకి ఫిర్యాదు అందింది. ఐఏఎస్‌లు నవీన్ మిట్టల్, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై ఈడీ కి బాధితులు ఫిర్యాదు చేశారు. కొండాపూర్ మజీద్ బండిలో 88 ఎకరాలను బాలసాయి ట్రస్ట్ కు ఓ కుటుంబం దానం చేసింది. భూపతి అసోసియేట్స్ కు 42 ఎకరాలు ఇస్తున్నట్లు 45 జీవో జారీ చేశారని బాధితులు ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ భూమికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి.. ముగ్గురు ఐఏఎస్ అధికారులు మోసం చేశారని ఈడీకి బాధితులు ఫిర్యాదు ఇచ్చారు.

అస‌లేం చేశారు..?
బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణితో భూ అక్ర‌మాలు జ‌రిగాయ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం దానిపై విచార‌ణ సాగిస్తున్న‌ది. ధ‌ర‌ణిని మార్చి, కొత్త‌గా ఆర్ ఓ ఆర్ యాక్ట్ ను తీసుకువ‌స్తున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే ప‌లు భూ అక్ర‌మాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి అక్ర‌మాలు ఎక్కువ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. దీంతో అప్పుడు క‌లెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన అమోయ్ కుమార్‌ను ఇటీవ‌ల విచార‌ణ చేస్తున్నారు. ఏకంగా ఈడీ వ‌ద్ద‌కు ఈ వివాదం చేరింది. అయితే, క‌లెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన అమోయ్‌తో పాటుగా సీసీఎల్ ఏ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన న‌వీన్ మిట్ట‌ల్‌, సీఎస్ గా ఉన్న సోమేశ్ కుమార్ కు కూడా ఈ అక్ర‌మాల్లో భాగం ఉన్న‌ట్లు విమ‌ర్శ‌లున్నాయి.

 

గ‌తంలోనే సోమేశ్ పై ఈడీ
రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఐజీఎస్టీ కుంభకోణంలోకి ఈడీ రంగ ప్రవేశం చేసింది. గతంలో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారీ స్థాయిలో నగదు అక్రమ చెలమణి జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం.. కేసును సీఐడీకి అప్పగించింది. అయితే తాజాగా ఈడీ సైతం ఈ కేసులో రంగంలోకి దిగింది. వారందరిపై కేసులు సైతం నమోదు చేసి షాక్ ఇచ్చింది. ఏ1గా వాణ్యిజ్య పన్నుల అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, ఏ2గా ఉప కమిషనర్ శివరామ్ ప్రసాద్, ఏ3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ4గా ప్లియంటో టెక్నాలజీస్, ఏ5గా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై కేసు బుక్ చేశారు.

ఖజానాకు భారీగా గండి
ఐజీఎస్టీకి సంబంధించి దాదాపుగా రూ.1400 కోట్ల మేర ఐటీసీని క్లెయిమ్‌ చేశారు. ఫలితంగా సర్కారు ఖజానాకు గండి పడ్డట్లు సీసీఎస్‌ పోలీసులు తమ ప్రాథమిక విచారణలో నిగ్గు తేల్చారు. బోగస్‌ ఇన్వాయిస్‌లతో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ను క్లెయిమ్‌ చేశారని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ గతేడాది చేపట్టిన ఆడిట్‌లో భాగంగా గుర్తించింది.
వస్తువుల పంపిణీ చేయకపోయినా, తప్పుడు ఇన్వాయిస్ లను సృష్టించినట్లు గుర్తించారు. రూ.వేల కోట్లలో స్కామ్ జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం, పూర్తి స్థాయి దర్యాప్తు కోసం కేసును సీఐడీకి అప్పగించేసింది.

సోమేష్ కుమార్ పైనే అనుమానం
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా, వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌కుమార్‌ చక్రం తిప్పారు. ఆయన కనుసన్నల్లోనే తాము సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసేందుకు అంగీకరించామని కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్‌ అంగీకరించినట్లు సీసీఎస్‌ పోలీసులు అప్పట్లోనే బహిర్గతం చేశారు. స్పెషల్‌ ఇనిషియేటివ్స్‌ పేరిట ఏకంగా ఓ వాట్సప్‌ గ్రూపు సైతం ఏర్పాటు చేశారు సోమేశ్. దీని ద్వారానే సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేవారని సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సోమేష్ సహకారంతోనే 75 సంస్థలకు సంబంధించి ఐటీ రిటర్నుల సమాచారం తెలియకుండా చేసేందుకు సాఫ్ట్ వేర్ ను మార్చారని, ఫలితంగా ఐటీసీ క్లెయిమ్‌లకు వీలు కల్పించారన్నారు. ఈ క్రమంలోనే సుమారుగా రూ.1400 కోట్ల మేర ఐటీసీ సొమ్మును క్లెయిమ్‌ చేసుకున్నట్లు గుర్తించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com