టీఎస్, న్యూస్:తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో స్పెషల్ పీపీని నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది సాంబశివరెడ్డిని నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. గత నెల రోజులుగా ఫోన్ టాపింగ్ కేసును పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ డీసీపీ రాధా కిషన్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కోర్టులో ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించాలని ప్రభుత్వం భావించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాల సేకరణపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నెలరోజులు గడుస్తున్న ఈ కేసులో లభించింది కొన్ని ఆధారాలు మాత్రమే. ఈ క్రమంలో హై ప్రొఫైల్ కేసు కావడంతో కేవలం ఈ కేసు కోసం మాత్రమే ప్రత్యేక పీపీని ప్రభుత్వం నియమించింది. స్పెషల్ పీపీగా సీనియర్ న్యాయవాది సాంబశివరెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నాంపల్లి కోర్టులో కొత్త పీపీ నియామక ఉత్తర్వులను జతపరుస్తూ మెమో దాఖలు చేశారు.
సోమవారమే కోర్టులో వాదనలు…
మరోవైపు ఫోన్ టాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ ముగిసింది కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని తిరుపతన్న కోరారు. తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. సోమవారం నాంపల్లి కోర్టులో తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్‌పైనా సోమవారమే కోర్టులో విచారణ జరుగనుంది. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో అన్ని పిటిషన్లపై ఏప్రిల్ 15న (సోమవారం)నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది.