Wednesday, November 13, 2024

యాదాద్రి కాదు.. యాదగిరి గుట్టనే..

టీటీడీ బోర్డు త‌ర‌హాలో యాద‌గిరి గుట్ట ఆల‌య బోర్డు..
గో సంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీ
కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేలా భ‌క్తుల‌కు ఏర్పాట్లు
యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ స‌మీక్ష‌
పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు

టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట ఆల‌య పాల‌క మండ‌లి బోర్డు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. శుక్ర‌వారం ఆయ‌న యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యం ఉండేలా ఏర్పాటు చేయనున్నామ‌ని, ఇందుకు పూర్తి అధ్య‌య‌నం చేసి ఏర్పాటు చేస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. గ‌తంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం లేద‌ని సీఎం గుర్తుచేశారు. కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి కావాల‌ని ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరో వారంరోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్ తో రావాలని చెప్పారు. ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

యాద‌గిరి గుట్ట‌గా పేరు  మార్పు
యాదాద్రిని యాద‌గిరి గుట్ట‌గా పేరు మార్పు చేస్తున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేర‌కు అన్నిరికార్డుల్లో ఇక నుంచి యాద‌గిరి గుట్ట‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆదేశించారు. గోశాలలో గో సంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అధికారులకు సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఆదేశించారు. ఈ స‌మీక్ష స‌మావేశంలో  మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, ఎమ్మెల్యేలు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.అంతకుముందు  యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య సందర్శించారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ ఈవో భాస్కరరావు మంత్రులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి నేడు యాదాద్రికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ముందస్తుగా మంత్రులు అక్కడికి చేరుకున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను వారు పరిశీలించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular