Friday, November 15, 2024

గణేష్ ఉత్సవాల సందర్భంగా మెట్రో, ఆర్టీసి నుంచి ప్రత్యేక సర్వీసులు

  • సోషల్ మీడియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు
  • నిమజ్జనంలోనూ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  • అధికారులను ఆదేశించిన రవాణా, బిసి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
  • 11 రోజుల పాటు ప్రజలకు ఆటంకాలు, ఇబ్బందులు రాకుండా చర్యలు
  • కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని మట్టి విగ్రహాలు పెట్టేలా ప్రోత్సహించాలి:ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

గణేష్ ఉత్సవాల సందర్భంగా మెట్రో ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంచేలా చూస్తామని రవాణా, బిసి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టను పెంచే విధంగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. గణేష్ ఉత్సవాలు ఘనంగా చేయాలంటే, ప్రజల సహకారం చాలా అవసరమన్నారు. జంట నగరాల్లో నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి నిర్వాహకులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబులు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీసే విధంగా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గణేష్ మండలపాలను ముఖ్యమంత్రితో సహా మంత్రులు సందర్శించి, వినాయక ఆశీస్సులు తీసుకుంటారని ఆయన చెప్పారు. ప్రజలు గణేష్ నిమజ్జనం చూడటానికి వస్తారని అందులో భాగంగా భక్తులకు ట్రాన్స్‌ఫోర్ట్, మెట్రో, ఎంఎంటిఎస్‌లను అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను అదేశించారు. ఒక్క రోజే గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని భాగ్య నగర గణేష్ ఉత్సవ్ సభ్యులను మంత్రి పొన్నం కోరారు.
సోషల్ మీడియాలో ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.

గతేడాది కంటే ఈసారి 20 శాతం ఎక్కువ వినాయకులు
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్, బాలాపూర్ ఉత్సవ కమిటీలకు అన్ని రకాలుగా సహకరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ 11 రోజుల పాటు జీహెచ్‌ఎంసీ, పోలీస్, విద్యుత్, ఫైర్, రవాణా శాఖ, మెట్రో ఇతర విభాగాలు సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆర్టీసి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుందని చెప్పారు. మెట్రో వేళలు సైతం పొడిగిస్తారని మంత్రి అన్నారు. రోడ్లపై మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. క్రేన్‌లకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు.

నిమజ్జనంలోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 40 సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయని, ఈసారి మరింత ఘనంగా జరుపుకోవాలని మంత్రి పొన్నం సూచించారు. గతేడాది కంటే 20 శాతం ఎక్కువ వినాయకుల విగ్రహాలు ప్రతిష్టించే అవకాశం ఉందన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని అందరూ మట్టి విగ్రహాలు ప్రతిష్టించాలని ఆయన సూచించారు. రోడ్లు మరమ్మతులకు గురైన చోట వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని విభాగాలను సమన్వయంతో మట్టి విగ్రహాలపై అవగాహన కలిపిస్తామని పొన్నం తెలిపారు.

ప్రజలు మట్టి విగ్రహాలను వినియోగించాలి: మంత్రి శ్రీధర్‌బాబు
ప్రజలు మట్టి విగ్రహాలను వినియోగించి సహకరించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహానగరంలో గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. నగరంలో ఇది అతి ముఖ్యమైన పండుగ అని ఆయన పేర్కొన్నారు. 11 రోజుల పాటు భక్తులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్ సమస్య రాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. గణపతి మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. గణేష్ ఉత్సవాలకు సంబంధించి వివిధ శాఖలతో సమావేశం నిర్వహించామని, పోలీస్, ఫైర్, హెల్త్, జిహెచ్‌ఎంసికి సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారని ఆయన తెలిపారు.

వివిధ ఉత్సవ కమిటీలకు సంబంధించిన నిర్వాహకులు గతంలో ఎదుర్కొన్నా చిన్న చిన్న ఇబ్బందులను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. వాటిని పునరావృతం కాకుండా చూడాలని అధికారులను అదేశించా మన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ , కరెంట్ ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించామని ఆయన తెలిపారు. అందరినీ కలుపుకొని ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించామన్నారు. కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని మట్టి విగ్రహాలు పెట్టేలా ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. అందరికీ మట్టి విగ్రహాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మట్టి విగ్రహాల ఉపయోగంపై పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించామని తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular