Friday, October 18, 2024

ఇద్దరు ఎమ్మెల్యేలు…ఓ సీనియర్ మంత్రి… మధ్యలో కొండా సురేఖ..?

  • కొండాను మంత్రి పదవి నుంచి దింపడమే వారి లక్షం..!
  • అసలు విషయాన్ని పిసిసికి చేరవేసిన వరంగల్ నేతలు
  • అనవసరంగా వారి మధ్యలో మమ్మల్ని లాగొద్దని విజ్ఞప్తి
  • సైలెంట్ అయిన ఇద్దరు ఆశావహులు

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించి ఆ పదవిని తమకు దక్కేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొండాను మంత్రి పదవి నుంచి దింపడమే లక్షంగా ఆ పార్టీకి చెందిన ఓ ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఓ సీనియర్ మంత్రి ఆమెపై రాష్ట్ర పిసిసికి ఫిర్యాదులు చేయిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బిసిగా, మహిళా మంత్రిగా ఆమె దించేసి తమకు లేదా తమ వారికి ఆ పదవి దక్కేలా ఈ ముగ్గురు కలిసి స్కెచ్ వేశారని, ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ ఈ పంచాయతీకి పుల్‌స్టాప్ పెట్టడంతో వారికి ఏంచేయాలో పాలుపోవడం లేదని సమాచారం. వరంగల్ జిల్లా నేతల అసలు విషయాన్ని పిసిసికి చేరవేయడంతో ఈ ముగ్గురు సైలెంట్ అయినట్టుగా తెలిసింది.

బుధవారం రాత్రి వరంగల్‌కు వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు
రెండు రోజులుగా మంత్రి కొండా సురేఖపై ఫిర్యాదు చేయడానికి వరంగల్ జిల్లా నేతలు నగరానికి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే రెండురోజులుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీని, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిసిన ఆ జిల్లా నేతలు మంత్రి కొండా సురేఖతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, జిల్లా మొత్తం కొండా వర్గం జోక్యం చేసుకుంటుందని, ఎమ్మెల్యేలైన తమ నియోజకవర్గాల్లో తమకు సమాచారం లేకుండా అభివృద్ధి పనులతో పాటు పలు పంచాయతీలను మంత్రి కొండా సురేఖ ఆమె భర్త మురళీ నిర్వహిస్తున్నారని తమ బాధలను వరంగల్ జిల్లా నేతలు పిసిసి ఎదుట ఏకరువు పెట్టారు. వారి బాధలను విన్న పిసిసి అధ్యక్షుడు సమస్యను పరిష్కరిస్తానని ఇరువురు పిలిపించి మాట్లాడతానని వారికి హామీనిచ్చారు. అయినా తృప్తి చెందని ఇద్దరు ఎమ్మెల్యేలు (గతంలో టిడిపిలో) పనిచేసిన వారు, ఓ సీనియర్ మంత్రి సలహాతో ఢిల్లీకి వెళ్లి మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ విషయం చిలికిచిలికి గాలివానలా మారుతుందని గ్రహించిన వరంగల్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి వరంగల్‌కు వెళ్లిపోగా మరో ఎమ్మెల్యే మాత్రం గురువారం తన నియోజకవర్గానికి వెళ్లిపోయినట్టుగా తెలిసింది.

ఈ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగవద్దు….
అయితే మంత్రి పదవి కోసం పోటీపడుతున్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు (గతంలో టిడిపిలో కలిసి పనిచేసిన వారు) మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా మంత్రి కొండా సురేఖను టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే మంత్రి కొండా సురేఖపై ఫిర్యాదు చేయాలని తమను ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇబ్బందులు పెడుతున్నారని వరంగల్ నేతలు పిసిసికి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. మంత్రి పదవి కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు చేస్తున్న రచ్చను, కొన్ని రోజులుగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు చేస్తున్న రాజకీయాల గురించి వరంగల్ నేతలు పిసిసికి వివరించినట్టుగా తెలిసింది. ఇలా ఈ ఇద్దరి ఎమ్మెల్యేలో ఎవరైనా ఒకరికి మంత్రి పదవి ఇస్తే చాలనీ కొండా సురేఖ మాత్రం మంత్రి పదవి దిగాల్సిందేని వారు పట్టుబడుతున్నారని అందులో తాము సమిధలం అవుతున్నామని పిసిసితో వరంగల్ నేతలు పేర్కొన్నట్టుగా తెలిసింది.

అందుకే సమయం దొరికినప్పుడల్లా వేరే పార్టీ నాయకులతో కలిసి మంత్రి కొండా సురేఖను టార్గెట్ చేసేలా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వ్యూహాలు రూపొందిస్తున్నారని ఈ రాజకీయాల్లో తమను లాగకుండా చర్యలు తీసుకోవాలని పిసిసిని వరంగల్ నేతలు కోరినట్టుగా తెలిసింది. అయితే గురువారం ఢిల్లీకి వెళ్లి కెసి వేణుగోపాల్‌ను కలిసి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేయాలనుకున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వెంట ఎవరూ లేకపోవడంతో ఏంచేయాలో తెలియక వారు కూడా సైలెంట్ అయిపోయినట్టుగా తెలిసింది. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు చేస్తున్న కుట్రలను మంత్రి కొండా సురేఖ మూడురోజుల క్రితమే పిసిసి అధ్యక్షుడికి, సిఎంకు వివరించినట్టుగా సమాచారం. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కావాలనే తనపై వారు దుష్ఫచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ పిసిసి, సిఎంలకు తెలియచేసినట్టుగా తెలిసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మోసం చేయడంలో రేవంత్ రెడ్డి ఘనుడు అన్న మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular