సమర్థవంతంగా నియంత్రణ చర్యలు: దక్షిణ మధ్య రైల్వే వెల్లడి
పార్లమెంటు ఎన్నికలు, వేసవి సెలవులు, వారాంతపు రద్దీ కారణంగా ఈ నెల 9 నుంచి 12 వరకు సికింద్రాబాద్‌తో పాటు పలు ప్రధాన నగరాల నుంచి వివిధ గమ్యస్థానాలకు ప్రత్యేక రైళ్లు, అదనపు బోగీల ఏర్పాటు కారణంగా అన్ రిజర్వుడు విభాగంలో 4.3 లక్షల మంది ప్రయాణీకుల అదనపు రద్దీని సమర్థవంతంగా నియంత్రించినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. జంట నగరాల్లోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్ల నుంచి ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని తెలిపింది. అధికారులు భారీ రద్దీని ముందస్తుగా గమనించి ప్రణాళికా బద్దమైన చర్యలు తీసుకున్నారని ద.మ.రైల్వే స్పష్టం చేసింది. జంట నగరాల నుంచి రోజుకు జనరల్ కోచ్‌లలో సగటున 1.05 లక్షల మంది ప్రయాణించారు. ఇది రోజువారీ సగటు 68,800 మంది అన్ రిజర్వుడు ప్రయాణికులతో పోలిస్తే 52 శాతం ఎక్కువ అని అంచనా వేసినట్లు తెలిపింది. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ నెల 9 నుండి 15 వరకు అదనంగా 60 కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్లను నడిపినట్లు పేర్కొంది.
ఈ ప్రత్యేక రైళ్లు నూరు శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీని నమోదు చేయడం విశేషం. జంట నగరాల నుంచి కాకినాడ, విశాఖపట్నం, నర్సాపూర్, నాగర్సోల్ , మచిలీపట్నం తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపగా, అదనంగా ఖుర్దా రోడ్, బెర్హంపూర్, బెంగళూరు, సంబల్పూర్, దానాపూర్, గోరఖ్పూర్, అగర్తలా, రక్సాల్, ఉదయపూర్, కటక్, సంత్రాగచ్చి, కొల్లాం, జైపూర్, రాజ్కోట్, తదితర దూర ప్రాంతాలకు కూడా ప్రత్యేక రైళ్లు నడిపినట్లు ద.మ.రైల్వే తెలిపింది. ప్రయాణీకుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి పలు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. రద్దీని సమర్ధవంతంగా నిర్వహించేందుకు కమర్షియల్, సెక్యూరిటీ, ఆపరేటింగ్ విభాగానికి చెందిన ప్రధాన, డివిజన్ కార్యాలయాలకు చెందిన అధికారులు స్టేషన్లలో నిరంతరం పర్యవేక్షించారు. ప్రత్యేక రైళ్ల గురించి తరచుగా ప్రకటనలు చేయడం, ఎలక్ట్రానిక్ బోర్డుల ద్వారా సమాచారాన్ని ప్రదర్శించడం, ప్రయాణీకులకు వారి సంబంధిత రైళ్లకు అనుగుణంగా మార్గనిర్దేశం చేయడం వల్ల ప్రయాణీకులకు చేరువై రద్దీని నియంత్రించినట్లు రైల్వే పేర్కొంది. కాగా ఈ సమయంలో రికార్డు సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడపడం సాధ్యమయ్యేలా అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమకూర్చడంలో రైల్వే ఆపరేటింగ్ విభాగం ప్రధాన భూమిక పోషించిందని తెలిపింది. ప్రయాణీకుల రద్దీని క్రమపద్దతిలో నియంత్రించడంలో, ట్రాఫిక్, ప్రయాణీకులకు అవసరమైన ఇతర ఏర్పాట్లను సమీకరించడంలో కమర్షియల్ విభాగం కీలక పాత్ర పోషించింది.
ఆరు డివిజన్లలోని అన్ని డివిజనల్ రైల్వే మేనేజర్లు ప్రధాన కార్యాలయంతో నిరంతరం సంప్రదింపుల ద్వారా అందుబాటులో ఉండి రైళ్లను సజావుగా నడపడానికి నిరంతరం పర్యవేక్షించారని ద.మ.రైల్వే పేర్కొంది.