Friday, March 28, 2025

డేటా అనుసంధాన ప్ర‌క్రియ వేగ‌వంతం చేయండి

  • ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌గా వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ తీసుకెళ్లండి
  • ఆర్టీజీఎస్‌పై స‌మీక్ష‌లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్ ఆదేశం

అమ‌రావ‌తి: ఆర్టీజీఎస్‌లో చేప‌డుతున్న డేటా అనుసంధాన ప్రక్రియ మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్ ఆదేశించారు. ఆర్టీజీఎస్ కార్య‌క‌లాపాలైన సోమ‌వారం ఆర్టీజీఎస్‌లో ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు. డేటా అనుసంధానంతో ఏర్పాటు చేస్తున్న డేటా లేక్ ప‌నుల ప్ర‌గ‌తి గురించి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ డేటా అనుసంధాన ప్ర‌క్రియ త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌న్నారు. ఇంకా డేటా అందివ్వ‌ని శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడి వారి నుంచి కూడా సాధ్య‌మైనంత త్వ‌ర‌గా డేటా తెప్పించి డేటా లేక్ ప‌నులు వేగ‌వంతం చేయాల‌న్నారు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆశ‌యాల‌క‌నుగుణంగా ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లందించేలా డేటా లేక్ ఏర్పాటు ప‌నులు చేప‌ట్టాల‌ని సూచించారు. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ అమ‌లు ప్ర‌గ‌తిపైన కూడా సీఎస్ స‌మీక్షించారు. వాట్సాప్ ద్వారా 200కుపైగా సేవ‌లందించ‌డం శుభ‌ప‌రిణామ‌న్నారు.

ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌గా వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను తీసుకెళ్లాల‌ని, ప్ర‌జ‌లు సుల‌భంగా ప్ర‌భుత్వం నుంచి అన్ని సేవ‌ల‌ను వాట్సాప్ ద్వారా పొందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ వినియోగించుకునేవారి సంఖ్య ఇంకా పెర‌గాల‌ని, పౌరులంద‌రూ ఈ సేవ‌లు ఉప‌యోగించుకునేలా ప్ర‌త్యేక దృష్టి సారించాల‌న్నారు. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లో పౌరులు త‌మ వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవ‌లు పొందే స‌దుపాయాన్ని కూడా త్వ‌రిత‌గ‌తిన ఏర్పాటు చేయాల‌న్నారు. ప్ర‌భుత్వ శాఖ‌ల్లో అధికారులు, సిబ్బంది యంత్రాంగం ప‌నితీరు మ‌రింత పెంపొందించేలా ఈ-ఫైళ్ల క్లియ‌రెన్సును మ‌దింపు వేయాల‌న్నారు. ఐటీ మ‌రియు రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని మాట్లాడుతూ వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ప్ర‌గ‌తి గురించి సీఎస్‌కు వివ‌రించారు. పౌరులు వాట్సాప్ ద్వారా కేవ‌లం టెక్ట్స్ మెజేజ్ ద్వారానే కాకుండా త‌మ వాయిస్ మెసేజ్ ద్వారా ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్సు సౌల‌భ్యంతో సుల‌భంగా అన్ని సేవ‌లు పొందేలా వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని, ప్ర‌స్తుతం ఇది ప‌రీక్ష ద‌శ‌లో ఉంద‌ని, త్వ‌ర‌లోనే దీన్ని పౌరులంద‌రికీ అందుబాటులోకి తెస్తామ‌న్నారు.

వాయిస్ ద్వారా పౌరులు ప్ర‌భుత్వం నుంచి తాము ఎలాంటి సేవ కోరుతున్నారో అడిగితే ఏఐ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ సేవ పొందే చోటుకు ఆటోమేటిక్‌గా తీసుకెళ్లే స‌ద‌పాయం క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పారు. డేటా అనుసంధాన ప్ర‌క్రియ కూడా వేగ‌వంతం చేస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టికే ప్ర‌తి ప్ర‌భుత్వ శాఖ‌లో ఒక చీఫ్ డేటా టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ (సీడీటీఓ)ను నియ‌మించ‌డం జ‌రిగింద‌న్నారు. దాదాపుగా అన్ని శాఖ‌లు డేటా లేక్‌తో అనుసంధానం అవుతున్నాయ‌ని, కొన్ని శాఖ‌ల నుంచి ఇంకా డేటా రావాల్సి ఉందని వాటిపైన ప్ర‌త్యేక దృష్టి సారించామ‌ని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి ప్ర‌జ‌ల‌కు, రైతుల‌కు వాతావ‌ర‌ణం గురించి క్షుణ్ణంగా వివ‌రాలు ఎప్ప‌టిక‌ప్పుడు అందించేలా ఆర్టీజీఎస్‌లో ఆవేర్ (ఆంధ్ర‌ప్ర‌దేశ్ వెత‌ర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చి సెంట‌ర్‌) హ‌బ్ ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే ఇది కార్య‌రూపం దాల్చ‌బోతుంద‌ని తెలిపారు. ఈ స‌మావేశంలో జీఎడీ పొలిటిక‌ల్ ముఖ్య కార్య‌దర్శి ముఖేష్‌కుమార్ మీనా, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ సంచాల‌కులు హిమాంషు శుక్లా, ఎక్సైజు శాఖ సంచాల‌కులు నిషాంత్ కుమార్‌, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ ప్ర‌వీణ్ ఆదిత్య ఆర్టీజీఎస్ ఇన్ ఛార్జి సీఈఓ ఎం. మాధురీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com