Friday, November 15, 2024

రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నింటిన శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
రాష్ట్రవ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అంబరాన్నంటాయి. జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీకృష్ణ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. రాధాకృష్ణుని వేషధారణతో ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్ని కృష్ణుని ఆట,పాటలతో రాష్ట్రం పులకించింది. జన్మాష్టమి సందర్భంగా ఆలయాల్లో పరంధాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కెపిహెచ్‌డి కాలనీలోని గోవర్ధనగిరిపై ఉన్న ఆలయంలో గోవిందుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయం ప్రాంగణంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బంజారాహిల్స్‌లోని పూరీ జగన్నాథ్, ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్లో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వేలాదిమంది భక్తులు వాసుదేవుడి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో రాధాకృష్ణుల వేషధారాలతో వెన్నతింటూ చిన్నారులు సందడి చేశారు.

నృత్యాలు చేసిన చిన్నారులు
ఆదిలాబాద్‌లో కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. సుందర సత్సంగ్ ఆధ్వర్యంలో భక్తులు కోలాటం భజనలతో బాల కృష్ణుడిని పల్లకి సేవతో ఊరేగించారు. పాఠశాలలో చిన్నారులు రాధా కృష్ణుని వేషధారణతో ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని శ్రీ గోపీజన వల్లభ దేవాలయంలో వేడుకలు వైభవంగా జరిగాయి. దేవాలయాన్ని పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఖాదీ హనుమాన్ ఆలయంలో గీతసత్సంగ్ ఆధ్వర్యంలో గోకులాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారికి విశేష అభిషేకాలు, పుష్పార్చన నిర్వహించిన భక్తులు వాసుదేవుడికి 108 రకాల ప్రసాదాలను నైవేధ్యంగా సమర్పించారు. కన్నయ్య వేషధారణలో చిన్నారులు ఉట్టి కొట్టి సందడి చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నీలవర్ణుడి జన్మాష్టమి సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీకృష్ణుడు, సత్యభామ వేషాధారణలో ప్రధాన వీధుల్లో గోపాలుడి గీతాలపై చిన్నారులు నృత్యాలు చేస్తూ అలరించారు.

చిన్నారులతో ఉట్టి సంబురాల్లో పాల్గొన్న ఎంపి కడియం
హనుమకొండలో కృష్ణాష్టమి సంబరాలు ఘనంగా జరిగాయి. మల్లికాంబ మనోవికాస కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపి కడియం కావ్య పాల్గొన్నారు. చిన్నారులతో కలసి కోలాటమాడిన ఎంపి ఉట్టి సంబరాల్లో పిల్లలతో సందడి చేశారు. వాసుదేవుడి జన్మాష్టమి పురస్కరించుకొని నిజామాబాద్‌లో వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీకృష్ణ పరమాత్ముడి జయంతి వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని లక్ష తులసీదళ పుష్పార్చనతో ప్రత్యేక పూజలు చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular