భద్రాచలం: శ్రీరామ నవమికి భద్రాచలం పుణ్య క్షేత్రం ముస్తాబైంది. శ్రీ సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది..
శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా నేడు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించ నున్నారు. రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది.
బుధవారం జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రాములోరి కల్యాణాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. భక్తులను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
ఆలయానికి రంగులు, విద్యుత్ వెలుగులతో సుందరంగా తీర్చిదిద్దు తున్నారు. ఆలయ పంచవటిలో ఉన్న శ్రీ సీతారాములు, లక్ష్మణ, రావణాసురుడు విగ్రహాలకు రంగులు వేశారు. గురువారం శ్రీ రామ పట్టాభిషేకం జరగనుంది.
విశిష్టమైనది రామాయణ గాధ..
భద్రాచలం ప్రాంతానికి చెందిన రామాయణ గాధ ఎంతో విశిష్టమైంది.. భద్రాచల రాముడిని భోగా రాముడని, దుమ్ముగూడెం రాముడిని ఆత్మ రాముడని, పర్ణ శాల రాముడిని శ్లోక రాముడిగా రామాయణంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.
అయితే, పర్ణ శాల పుణ్య క్షేత్రంలో శ్రీ సీతారాముల వారు 14 ఏళ్లు అజ్ఞాత వాసం చేశారనే ఉద్దేశంతో భక్తులు ఈ ప్రాంతాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతారు.
గోదావరి నదీ తీరాన పర్ణ శాల వద్ద పంచవటి, నార చీరల ప్రాంతం పర్ణ శాల చరిత్రకు సేజీవ సాక్షులుగా మిగిలాయి. ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న పర్ణ శాల పుణ్య క్షేత్రం శ్రీ సీతారాముల కల్యాణానికి ఎంతో సుందరంగా ముస్తాబైంది..
భద్రాచలం రామయ్యను దర్శించుకున్న ప్రతి భక్తుడు పర్ణ శాల రామయ్యను దర్శించుకొని పరవశించి పోతుంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పర్ణశాల పుణ్య క్షేత్రానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రసాద పథకం కింద ప్రత్యేక నిధులు మంజూరు చేసింది.
శ్రీరామ నవమి రోజు శ్రీ సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం తాగు నీరు, మజ్జిగ ప్యాకెట్లతో పాటు చలువ పందిళ్లు వేశారు.
స్వామి వారి కల్యాణ వేడుకలు వీక్షించేందుకు మొత్తం 24 సెక్టార్లు ఏర్పాటు చేశారు. ప్రతి సెక్టార్‌లో ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు.
భక్తులు https://bhadradrit emple.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు, వసతి గదుల బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు..