Monday, April 21, 2025

సాయం చేయకుండా బిఆర్‌ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారు

  • సంక్షోభ సమయాల్లో బాధ్యతగా వచ్చి సాయం చేయాలి
  • రాజకీయం చేయడం తగదు
  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

ప్రకృతి విపత్తుల సమయంలో సాయం చేయకుండా బిఆర్‌ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. సంక్షోభ సమయాల్లో బాధ్యతగా వచ్చి సాయం చేయాలే తప్ప రాజకీయం చేయడం తగదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హితవు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో చర్చిస్తూ సహాయక చర్యలను నిర్ధేశించినట్లు ఆయన వెల్లడించారు. మృతులకు పరిహారం ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జరిగిన సమీక్ష అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి సాయం చేయాలంటూ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాలకు విజ్ఞప్తి చేసినట్లు ఆయన వివరించారు.

8 జిల్లాలపై తీవ్ర ప్రభావం
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా 8 జిల్లాలకు తీవ్రమైన ప్రభావం పడిందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇప్పటివరకు 16 మంది మృతిచెందినట్టు నివేదిక వచ్చిందని మంత్రి తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వర్షాలకు నష్టపోయిన రైతులు జిల్లాలపై అధికారులతో సమీక్ష చేశామన్నారు. ఖమ్మంలో తీవ్ర ప్రభావం ఉండడం వల్ల మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు అక్కడే ఉన్నారన్నారు.

నీటిపారుదలశాఖ అధికారులు పోలీసు, జీహెచ్‌ఎంసి సిబ్బందితోనూ సమావేశం నిర్వహించామని, వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సాయం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటుందని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. అత్యవసర పరిధిలో తప్ప బయటకు ఎవరూ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించినట్లు తెలిపారు.

ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదు
విపత్కర పరిస్థితులను ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. విద్యుత్ రహదారులు రోడ్డు నిర్మాణాలను వెంటనే పునరుద్దరించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి జిల్లా కలెక్టరలతో నేరుగా మాట్లాడారని ఆయన తెలిపారు. విపత్కర పరిస్థితులను రాజకీయం చేయడం సరైందికాదని బిఆర్‌ఎస్ నేతలనుద్దేశించి ఆయన హితవు పలికారు. హరీశ్‌రావు, కెటిఆర్ ఇప్పటికైనా తన బుద్ది మార్చుకోవాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆయన కోరారు. ప్రధాని నరేంద్రమోడీని రాష్ట్రంలో పర్యటించాలని సిఎం కోరారని ఆయన పేర్కొన్నారు. వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటకు రావొద్దన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com