తెలంగాణ జిల్లాల నుంచి పలువురు శ్రీనగర్‌కు పర్యటనకు వెళ్లారు. పహల్గాంలో ఉగ్రదాడి జరడంతో వీళ్లు ఆందోళనకు గురవుతున్నారు. అక్కడ ఓ హోటల్‌లో దాదాపు 80 మంది తెలంగాణ పర్యటకులు చిక్కుకుపోయారు. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేశారు. తామందరం కూడా హోటల్‌లో చిక్కుకున్నామని.. మమ్మల్ని హైదరాబాద్‌కు సురక్షితంగా తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హోటల్‌లో చిక్కుకున్న వాళ్లలో హైదరాబాద్ నుంచి 20 మంది ఉన్నారు. వరంగల్ నుంచి 10 మంది ఉన్నారు. మహబూబ్‌నగర్ నుంచి 15 మంది, సంగారెడ్డి నుంచి 10 ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ పట్టణానికి చెందిన రెండు కుటుంబాలు కూడా ఉన్నాయి. వీళ్లందరూ మంగళవారం జమ్మూకశ్మీర్ సందర్శనకు వెళ్లగా.. శ్రీనగర్ హోటల్‌లోకి చిక్కుకుపోయారు.
మరోవైపు పహల్గాంలోని బైసరాన్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రాంతాన్ని అమిత్ షా పరిశీలించారు. అలాగే దాడి నుంచి బయటపడ్డ వాళ్లని, మృతులు కుటుంబాలను కలిశారు. ఈ దాడికి బాధ్యులైన వాళ్లని చట్టం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. అలాగే అంతకుముందు ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. బుధవారం సాయంత్రం ప్రధానీ మోదీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రైక్‌కు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ సలహాదారుడు అజిత్ దోవల్ ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.