- సాగర్ దిశగా కృష్ణమ్మ పరుగులు
- ఎగువ నుంచి 4.52లక్షల క్యూసెక్కులు
- గరిష్టానికి చేరువలో 879అడుగులకు నీటిమట్టం
- గోదావరికి స్వల్పంగా తగ్గిన వరద
- భద్రాచలం వద్ద 43.3అడుగులు
ఎగువ ప్రాంతాలనుంచి భారీగా వరద ప్రవాహంతో కృష్ణమ్మ పోటెత్తింది. రెండేళ్ల తరువాత శ్రీశైలం గేట్లు తెరుచుకున్నాయి.సోమవారం నాడు శ్రీశైలం వద్ద పర్యాటకుల సందడి మొదలైంది.ప్రాజెక్టు నుంచి కృష్ణానదీజలాలు దిగువకు జాలువారి తిరిగి ఉవ్వేత్తున ఎగిసే జలదృశ్యం ఆవిష్కరణతో పర్యాటకలు కేరింతలు కొట్టారు. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి రోజుకు 40టిఎంసీలకు పైగా నీరు చేరుకుంటోంది. ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా,సాయంత్రానికే 879అడుగులకు చేరింది. గరిష్ట స్థాయికి కేవలం 5అడుగులు ఉందనగానే కేంద్ర జలసంఘం హెచ్చరికల మేరకు ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు.
శ్రీశైలం రిజర్వాయర్‌లో పూర్తి స్థాయి నీటినిలువ సామర్ధం 215టిఎంసీలు కాగా ఇప్పటికే నీటినిలువ 184టిఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి 4,52,583క్యూసెక్కలు నీరు రిజర్వాయర్‌లోకి చేరుతోంది. ప్రాజెక్టు 6,7,8 గేట్లు పది అడుగుల మేరకు ఎతి వేసి ఒక్కో గేటు ద్వారా 27వేల క్యూసెక్కువ చొప్పున 81000క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు.మరో వైపు ఎడమగట్ట జలవిద్యుత్ కేంద్రం నుంచి , కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇటు కల్వకుర్తి ఎత్తిపోతల పథాకానికి 16000, అటు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ఎస్‌ఆర్‌ఎంసిలోకి 15వేలక్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు !!
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ జలాశయం దిశగా కృష్ణమ్మ పరగులు పెడుతోంది.ఎగువ నుంచి 54772క్యూసెక్కుల వరదనీరు సాగర్ జలాశయంలోకి చేరుతోంది. ప్రాజెక్టులో నీటిమట్టం 512అడుగులకు చేరుకోగా, నీటి నిలువ 136టిఎంసీలకు చేరింది. .జూరాలకు ఎగువనుంచి వరద ప్రవాహాలు మరింత పెరుగుతున్నాయి.ఆల్మట్టి ప్రాజెక్టులోకి 3లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, నారాయణపూర్‌లోకి 2.29లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఈ రెండు జలాశయాల నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టుగా బయటకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు 3.15లక్షల క్యూసెక్కుల చేరుతుండగా,ప్రాజెక్టు 41గేట్లు ఎత్తి అంతే నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. అటు తుంగభద్రలో కూడా వరద ప్రవాహం పెరిగింది. ఇప్పటికే తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఎగువ నుంచి 1.31లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా గేట్ల ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్టుగా విడుదల చేస్తున్నారు.
తగ్గిన గోదావరి ప్రవాహం
గోదావరిలో వరద ప్రవాహాలు తగ్గుముఖం పట్టాయి. శ్రీరాం సాగర్‌లోకి ఎగువ నుంచి 17310క్యూసెక్కుల నీరు చేరుతుండగా, నీటినిలువ 34టిఎంసీలకు చేరింది. దిగువన శ్రీపాద ఎల్లంపల్లిలోకి 16081క్యూసెక్కులు చేరుతుండగా,అంతే నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.మేడిగడ్డ వద్ద లక్ష్మీబ్యారేజి మీదుగా గోదావరిలో 5.79లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. దుమ్ముగూడెం వద్ద 9.32లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద 8.99లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నదిలో నీటిమట్టం 43.3అడుగులకు తగ్గటంతో రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించి మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. 43అడుగులకంటే దిగువకు తగ్గితే దీన్ని కూడా ఉపసంహరించనున్నారు.