Wednesday, November 20, 2024

ఎన్నికల నేపథ్యంలోనే పడిపోయిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం

ఎన్నికల నేపథ్యంలోనే పడిపోయిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం ఇప్పటివరకు రూ.13,270 కోట్ల ఆదాయం మాత్రమే రాష్ట్రంలో భూముల క్రయ, విక్రయాలపై ఎన్నికల ప్రభావం పడింది. తెలంగాణలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం నిర్ధేశించిన లక్ష్యంలో 80 శాతానికి మించి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వ్యవసాయ రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గగా, స్థిరాస్తి వ్యాపార లావాదేవీలు మాత్రం గత ఆర్థిక ఏడాది కంటే ఎక్కువే జరిగినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 2023-, 24 ఆర్థిక సంవత్సరంలో రూ.18,500 కోట్లు రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు, ఇతర కారణాల వల్ల ప్రభుత్వ లక్ష్యం మేరకు రాబడులు వచ్చే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. ప్రధానంగా వ్యవసాయ భూముల క్రయ, విక్రయాలు భారీగా తగ్గినట్లు, తద్వారా వచ్చే ఆదాయం కూడా పడిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.14,500 కోట్లుకుపైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆర్థిక సంవత్సరం ఆశించిన మేర రాబడిని అందుకునే అవకాశం లేదని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో….

ఈ మార్చి నెలలో 1.5లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగ్గా తద్వారా రూ.1,300ల నుంచి రూ.1,350 కోట్లు వరకు ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 2023-, 24 ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించిన రూ. 18,500 కోట్లు రూపాయలతో పోలిస్తే 2023-, 24 ఆర్థిక ఏడాదికి రూ. 14,500 కోట్లు వస్తుందంటే దాదాపు 20 శాతం తగ్గుదలను నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా 2023 సంవత్సరంలో దాదాపు నాలుగు నెలలపాటు శాసనసభ ఎన్నికలు కారణంగా వ్యవసాయ భూముల క్రయ, విక్రయాలు భారీగా తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఫిబ్రవరి నెలలో పెరిగిన రాబడులు

2019,-20 ఆర్థిక ఏడాదిలో 16.59 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, తద్వారా రూ.7,061 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. 2020,-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోయాయి. ఆ సమయంలో కేవలం 12.10 లక్షల రిజిస్ట్రేషన్లు జరగ్గా, తద్వారా రూ.5,260 కోట్లు రాబడి మాత్రమే వచ్చింది. 2021,-22 ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్లు తిరిగి పుంజుకున్నాయి. ఆ ఆర్థిక ఏడాది 19.72 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగ్గా తద్వారా రూ.12,370 కోట్లు ప్రభుత్వానికి రాబడి చేకూరింది. ఇక 2022, -23 ఆర్థిక ఏడాదిలో 19.47 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌లు జరగ్గా రూ.14,291 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది. ప్రస్తుతం జరుగుతున్న 2023-, 24 ఆర్థిక సంవత్సరంలో గడిచిన 11 నెలల కాలంలో (ఫిబ్రవరి 29వ తేదీ వరకు) 16.31 లక్షల డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ జరగ్గా తద్వారా రూ.13,270 కోట్లు ప్రభుత్వానికి రాబడి వచ్చింది. ప్రధానంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు ఫిబ్రవరి నెల రాబడులు స్వల్పంగా రూ.257 కోట్లు పెరిగినప్పటికీ రిజిస్ట్రేషన్లు పెద్ద సంఖ్యలో తగ్గాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పదివేలకు పైగా భారీగా తగ్గడం, వ్యవసాయేతర ఆస్తులు క్రయ, విక్రయాలు స్వల్పంగా పెరగడంతో ఆదాయం కూడా రూ.150 కోట్లు వరకు అధికంగా ఆదాయం వచ్చింది. గడిచిన 11 నెలల్లో 16.31 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, రూ.13,270 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన రూ.13,270 కోట్లకు మరో రూ.1,350 కోట్లు కలిపితే దాదాపు 14,500 కోట్లుకుపైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అంచనా వేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular