Monday, September 30, 2024

త్వరలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి, జిఎంలపై వేటు..?

  • ధరల నిర్ణయంపై మంత్రికి తెలియకుండా సిఎస్‌కు వెళ్లిన ఫైల్
  • అన్నీ తానై చక్రం తిప్పిన ఓ మంత్రి సమీప బంధువు

రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి, జిఎంలపై వేటు వేయడానికి రంగం సిద్ధం అయ్యింది. కొత్త బీర్ల కంపెనీలకు రూ.907లకు అనుమతిచ్చిన వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. తమకు తెలియకుండానే ఈ ధరను ఎలా నిర్ణయిస్తారని సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి, జిఎంలపై ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ విషయాన్ని సిఎం దృష్టికి ఆయన తీసుకెళ్లినట్టుగా తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమ్ముడవుతున్న బీర్ల కన్నా కొత్తగా వచ్చే బీర్లకు అధికధరను ఖరారు చేయడంపై ఎక్సైజ్ శాఖ విచారణ సైతం చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల్లో నివేదిక సమర్పించనున్నట్టుగా సమాచారం.

ప్రస్తుతం రూ.100 నుంచి రూ.1,000లోపు
అయితే, రాష్ట్రంలో మద్యం ధరలకు సంబంధించి రిటైర్డ్ జడ్డి, రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ సీఈలతో కూడిన కమిటీ ఈ ధరలను నిర్ధారిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీరు ధరలకు మనరాష్ట్రంలో ప్రస్తుతం రూ.100 నుంచి రూ.1,000లోపు (కాటన్,12 బీర్లకు) చెల్లిస్తున్నారు. (ఉదా…ఒక కింగ్‌పిషర్ బీరుకు రూ.28లు చెల్లిస్తుండగా, మద్యం షాపుల్లో దానిని రూ.150లకు విక్రయిస్తున్నారు. (ఇలా 12 బీర్లకు రూ.200ల నుంచి రూ.300ల వరకు) ఆయా కంపెనీల బట్టి చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మద్యం అమ్మే వారికి 20 శాతం కమీషన్‌తో పాటు రాష్ట్ర ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్‌లతో పాటు తదితర పన్నులను కలుపుకొని ఇలా బీరును విక్రయించే ధరలను ఎక్సైజ్ శాఖ నిర్ణయిస్తుంది.

అయితే కొత్తగా మనరాష్ట్రంలోకి వచ్చే మద్యం కంపెనీలకు ఎంత చెల్లించాలి, ఆయా రాష్ట్రాల్లో ఎంత ధర ఉన్నది అన్న విషయాలను ప్రభుత్వానికి సంబంధించి మరో కమిటీ కూడా సమీక్షించి ఈ ధరలను ఖరారు చేస్తోంది. ఈ కమిటీలో రెవెన్యూ సెక్రటరీ, మంత్రి, బేవరేజస్ ఎండి, ఎక్సైజ్ శాఖ కమిషనర్‌లు ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వివాదస్పదం అవుతున్న కొత్త బీర్ల కంపెనీల విషయంలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి నుంచి సంబంధిత మంత్రికి ఫైల్ వెళ్లకుండా సిఎస్‌కు వెళ్లిందని, ఈ నేపథ్యంలోనే మిగతా రాష్ట్రాల్లోనూ ఆ బీర్ల విక్రయంపై విమర్శలు రావడంతో ప్రస్తుతం ఆ బీర్లను మార్కెట్‌లో రాకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. అయితే ఈ ధర విషయంలో ఓ మంత్రి సమీప బంధువు అంతా తానై చక్రం తిప్పినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కర్ణాటక, తమిళనాడు, గోవాకు మనబీర్లు….
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ బీర్ల విక్రయంపై అనేక ఆరోపణలు రావడం, అధిక ధరను చెల్లించాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ పేర్కొనడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రెండు, మూడు రోజుల్లో నివేదిక అందగానే సంబంధిత బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి, జిఎంలపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. ప్రస్తుతం మనదగ్గర బీర్లను తయారు చేసే కంపెనీలు 6 ఉండగా వాటికి ప్రభుత్వం మూడునెలలకు ఒకసారి చెల్లింపులు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆయా కంపెనీలు వెంటనే చెల్లింపులు చేసే కర్ణాటక, తమిళనాడు, గోవా, మహారాష్ట్రలకు ఇక్కడి బీర్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ వేసవికాలంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లింపులు చేయకపోవడంతో ఆయా కంపెనీలు ఇదే వైఖరిని అవలంభించాయని ఈ నేపథ్యంలోనే మనరాష్ట్రంలో బీర్లకు కృత్రిమకొరత వచ్చిందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular