Sunday, September 29, 2024

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేయాలి

  • ఇసి అనుమతితో అధికారులను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
  • పరేడ్ గ్రౌండ్‌లో వైభవంగా నిర్వహణ
  • ముందుగా గన్‌పార్కు వద్ద సిఎం అమరవీరులకు నివాళులర్పిస్తారు: వివిధ శాఖలతో సిఎస్ శాంతికుమారి సమీక్ష

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఇసి) ప్రభుత్వానికి అనుమతివ్వడంతో అందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టాల్సిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్ల పై అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. జూన్ 2న ముందుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గన్ పార్క్ ను సందర్శించి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారని సిఎస్ తెలిపారు.

ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలను కేటాయించేటప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించారు. ముఖ్యంగా విఐపిలు తమ వాహనాలు దిగే చోట, పికప్ పాయింట్లు, పార్కింగ్ స్థలాలను కేటాయించేటప్పుడు సరైన ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని, తదనుగుణంగా వాన్టేజ్ పాయింట్ల వద్ద సంకేతాలను అందించే ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీ పోలీసు శాఖకు స్పష్టం చేశారు. వేదిక నుంచి నిష్క్రమించే సమయంలో అనవసరమైన జాప్యాన్ని నివారించడానికి, సజావుగా, సకాలంలో బయలుదేరేలా చూసేందుకు పిక్ అప్ పాయింట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు ఎండకు గురికాకుండా బారికేడింగ్ ఏర్పాటు చేసి, షామియానాలతో నీడ ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖను ఆదేశించారు.

సభా ప్రాంగణం పరిసరాల్లో పారిశుద్ధ పనుల నిర్వహణతో పాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలను అలంకరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. క్లీనింగ్, లెవలింగ్, వాటర్, శానిటరీ, హైజీనిక్ పరిస్థితుల నిర్వహణ విషయంలో జిహెచ్‌ఎంసి అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. నిరంతరాయంగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని విధ్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సభా వేదిక వద్ద టీమ్ బై టీమ్‌ను ఉంచుతూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని సిఎస్ ఇంధన శాఖకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షలో డిజిపి రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, ముఖ్య కార్యదర్శులు బి.వెంకటేశం, జితేందర్, కార్యదర్శులు క్రిస్టినా జోంగ్తు, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండి సుదర్శన్ రెడ్డి, టీఎస్‌పీడీసీఎల్ ఎండీ ముషారఫ్, సీడీఎంఏ దివ్య, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular