Wednesday, December 25, 2024

రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అయిదో రోజు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో శాసనసభ మొదలైంది. అయితే పలు అంశాలు శాసనసభలో చర్చకు వస్తుండటంతో ప్రతిపక్షం, అధికారపక్షం ఇరుపక్షాలు తమ వాదనలను గట్టిగా వినిపించే అవకాశం ఉంది. రైతు భరోసా విధివిధానాలపై, భూ భారతి చట్టంపై ఇరు పక్షాలు తమ వాదనలను బలంగా వినిపించేందుకు సిద్దం కావడంతో రాష్ట్ర శాసనసభ ఇవాళ వాడీవేడిగా కొనసాగే అవకాశం ఉంది. అయితే, సభ మొదలుకాగానే.. రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. భూ భారతి చట్ట ప్రకటనలపై సభా హక్కుల ఉల్లంఘనకు బీఆర్‌ఎస్ భావిస్తున్నది. శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించారని నోటీసులో పేర్కొన్నారు. సభ ఆమోదం పొందని భూ భారతి బిల్లును చట్టంగా ఎలా ప్రకటిస్తారని, ప్రజలను తప్పుదోవ పట్టించారని బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆరోపించారు. శాసనసభా హక్కుల రక్షణ కోసం సభాపతికి వినతిపత్రం ఇచ్చారు. శాసనసభ హక్కులను కాపాడాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం పేర్కొన్నది. ఆమోదం పొందని భూభారతి బిల్లును చట్టంగా ప్రకటించిన ప్రభుత్వ తీరుపై ఈ సందర్భంగా అగ్రహం వ్యక్తం చేశారు.
సభ ప్రారంభంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పద్ధతి ప్రకారం పూర్తి చేస్తున్నామని, కాస్ట్‌ బెనిఫిట్‌ రేషియో చూసుకుని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తామని వెల్లడించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ కాల్వకు రూ.120 కోట్లు మంజూరు చేశామని, త్వరలో టెండర్లు పిలుస్తామని, ఇరిగేషన్‌ శాఖను బలపరుస్తున్నామన్నారు. పదేళ్లుగా ఇరిగేషన్‌ శాఖలో నియామకాలు లేవని, తాము అధికారంలోకి వచ్చాక 700 మందిని ఇరిగేషన్‌ శాఖలోకి తీసుకున్నామని వివరించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణకు రూ. 37 కోట్లు విడుదల చేశామని, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణకు ఈ వారంలో రూ.22 కోట్లు విడుదల చేస్తామని, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించామని, రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు.
అనంతరం మాజీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కొత్త పురపాలక, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుల్లో ఈ అంశం లేదని, 3 బిల్లులకు బీఆర్ఎస్ తరఫున సవరణలు ప్రతిపాదిస్తున్నామన్నారు. తమ సవరణలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిందేనని, అవసరమైతే సభలో డివిజన్‌కు కూడా పట్టుబడతామని కేటీఆర్ చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, నవంబర్‌లోగా కులగణన పూర్తి చేస్తామని కూడా చెప్పిందని కేటీఆర్‌ గుర్తు చేశారు. కులగణన తేల్చకుండా చట్ట సవరణకు అసెంబ్లీలో ప్రయత్నిస్తున్నారని, 50శాతం పైగాఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేస్తున్నారని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్లు ప్రస్తావించకపోవడం బీసీలను మోసం చేయడమే అని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, రైతు రుణమాఫీపై బీజేపీ నిరసనకు దిగింది. ఎడ్లబండిపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చి నిరసన తెలిపారు. రైతు రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని ప్లకార్డులను ప్రదర్శించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com