* మహనగరానికి మంచినీటితో పాటు సేద్యంలోకి కొత్త ఆయకట్టు
* సింగూరు ప్రాజెక్ట్ లో పూడిక తీతకు సన్నద్ధం
* కాలువల లైనింగ్‌కు టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టండి
* బసమేశ్వర,సంఘమేశ్వర,ఎత్తిపోతల పధకాలు సత్వరమే పూర్తికి ఆదేశాలు
* పెద్దారెడ్డిపల్లి ఎత్తిపోతల పధకానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి
* అర్ధాంతరంగా ఆగి పోయిన ప్యాజేజి 19ఏ పనులు పునరుద్ధరణకు నిర్ణయం
* రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
సింగూరు,మంజీరా రిజర్వార్లకు గోదావరి జలాలను తరలిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా మహానగరం హైదరాబాద్ ప్రజల దాహార్తికి శాశ్వతపరిదష్కారంతో పాటు సింగూరు,మంజీరా రిజర్వార్లకింద సేద్యంలోకి కొత్త ఆయాకట్టను తీసుకవస్తామని ఆయన తెలిపారు. అలాగే నిజాంసాగర్‌ను కూడా గోదావరి జలాలతో నింపుతామని ఆయన చెప్పారు. బుధవారం హైదరాబాద్ ఎర్రమంజిల్ కాలనీ లోని జలసౌధలో ఉమ్మడి మెదక్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్‌లు, ఎత్తిపోతల పథకాలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖామంత్రి దామోదర్ రాజనరసింహ ,మాజీ శాసనసభ్యులు తూర్పు జయప్రకాష్ రెడ్డి నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ,ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి,ఇ.ఎన్.సిలు అనిల్ కుమార్, నాగేందర్ రావు, సి.ఇ ధర్మ తదితరులతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగూరు ప్రాజెక్ట్ లో పూడిక తీతకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర జలవనరుల సంఘం రూపొందించిన విధానం ప్రకారమే పూడిక తీత పనులు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. యుద్ధప్రాతిపదికన పూడిక తీత పనులు చేపట్టాలని ఆయన సూచించారు.
పూడిక తీత ద్వారా నీటి సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకు గాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా సింగూర్ కాలువల లైనింగ్‌కు టెండర్లు పిలువలన్నారు ప్రధానంగా టెండర్లు పూర్తి చేసుకుని ఒప్పందాలు కుదుర్చుకున్న పనులు మొదలు పెట్టని బసనేశ్వర్,సంఘమేశ్వర ఎత్తిపోతల పథకాలను సత్వరమే మొదలు పెట్టాలన్నారు. పెద్దారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలు సిద్ధం చేసి పాలనా పరమైన అనుమతులు తీసుకోవాలన్నారు. అన్నీ పూర్తయితే డిసెంబర్ మాసాంతానికి శంకుస్థాపన జరుపుకోవచ్చని ఆయన సూచించారు.
పెద్దారెడ్డిపల్లి ఎత్తిపోతల పధకానికి సుమారు 660 కోట్లు అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే అర్ధాంతరంగా ఆగి పోయిన ప్యాకేజ్ 19 ఏ పనులు తక్షణమే పునరుద్ధరించాలన్నారు. ప్యాకేజీ 19 ఏ పునరుద్ధరణకు 600 కోట్లుగా అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్యాకేజ్ 17,18,19ల పనులు వేగవంతం చేయాలన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నల్లవాగు మీడియం ప్రాజెక్ట్ కెనాల్ మరమ్మతులతో పాటు మొత్తం జిల్లాలోని 38 చిన్న నీటిపారుదల చెరువుల మరమ్మతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆమోదం తెలిపారు. అలాగే నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో కారముంగి ఎత్తిపోతల పథకానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.