Saturday, May 10, 2025

త్వరలోనే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలి ఎంపిక

ముగ్గురి పేర్లను ఏఐసిసికి సిఫారసు చేసిన రాష్ట్ర నాయకత్వం
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిని ఎంపిక చేసేందుకు ఏఐసిసి కసరత్తు చేస్తోంది. మూడు రాష్ట్రాలకు కొత్త మహిళా అధ్యక్షులను ప్రకటించిన ఏఐసిసి త్వరలోనే తెలంగాణకు నూతన అధ్యక్షురాలి పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మంగళవారం రాత్రి కర్ణాటక మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సౌమ్యరెడ్డి, చండీఘడ్‌కు చెందిన నందిత హుడా, అరుణాచల్ ప్రదేశ్‌కు చుకునచ్చిలను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియమిస్తూ పేర్లను ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎంపిక కూడా త్వరలో జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ముగ్గురు మహిళా నాయకుల పేర్లను రాష్ట్ర నాయకత్వం ఏఐసిసికి సిఫారసు చేసినట్టుగా సమాచారం. రాష్ట్ర నాయకత్వం ఏఐసిసికి సిఫారసు చేసిన వారిలో గద్వాల్ మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, కాంగ్రెస్ నాయకురాలు సరితా తిరుపతయ్య, బడంగిపేట మేయర్ పారిజాత నర్సింహా రెడ్డిలతో పాటు మరో బిసి మహిళ సరిత పేర్లను జూలై 11వ తేదీన రాష్ట్ర పిసిసి ఏఐసిసికి ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఒకరికి మహిళా కాంగ్రెస్ పదవి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతుండగా, తాను సూచించిన నీలం పద్మకే ఆ పదవి ఇవ్వాలని సునీతారావు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నట్టుగా తెలిసింది. ఈ ముగ్గురు కాకుండా తనతోపాటు పని చేస్తున్న నీలం పద్మకు ఆ పదవి ఇస్తే మహిళలకు న్యాయం జరుగుతుందని ఆమె ఏఐసిసికి విన్నవించినట్టుగా సమాచారం.

నాకు వేరే పదవి ఇచ్చిన తరువాతే….
దీంతోపాటు తనను మహిళా అధ్యక్షురాలిగా తప్పిస్తే తనకు వేరొక పదవి ఇవ్వాలని అది ఇచ్చిన తరువాతే మహిళ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించాలని సునీతారావు డిమాండ్ చేస్తుండడం విశేషం. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పదవీ కాలం ముగిసింది. ఆమె స్థానంలో కొత్త నాయకురాలిని నియమించేందుకు కొంత కాలంగా ఏఐసిసి కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకు ఏదైనా పదవి ఇవ్వాలని ప్రస్తుత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఏఐసిసికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలిసింది. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అలకలాంబ ద్వారా సునీతారావు కాంగ్రెస్ పెద్దలను కలిసినట్టుగా సమాచారం. మహిళా అధ్యక్షురాలి కోటా కింద గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన సునీతారావు ఓటమి పాలవ్వడం విశేషం.

జాతీయ స్థాయిలో లాబీయింగ్
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన వారెవరికి కూడా ఏడాదిపాటు ఎలాంటి పదవులు ఇవ్వరాదని ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యే పోడెం వీరయ్యకు, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఇలా ఓడిన కొందరికి పదవులు ఇచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తనకు కూడా పదవి ఇవ్వాలని సునీతారావు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలిసింది. సిఎం రేవంత్ రెడ్డితో పాటు జాతీయ స్థాయిలో పార్టీ పెద్దలను కలిసి తనకు తన స్థాయికి తగిన పదవి ఇచ్చేట్లు చూడాలని సిఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దల నుంచి సిఫారసు చేయించినట్టుగా సమాచారం. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి కసరత్తు జరుగుతుండగా మహిళా అధ్యక్షురాలిని కూడా కొత్తగా నియమించాలని ఏఐసిసి నిర్ణయించడంతో ఎవరు ఈ పదవికి ఎంపిక అవుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com