Wednesday, December 25, 2024

అమరావతి అభివృద్ది పనులకు తొలగిన అడ్డంకులు

  • సాంకేతిక కమిటీ నివేదికలోని 23 ప్రతిపాదనల ప్రకారం పాత టెండర్లు క్లోజ్
  • హైకోర్టు, అసెంబ్లీ మినహా మిగతా పనులకు డిశంబరు 31 లోపు నూతన టెండర్లు
  • హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణాలకు  జనవరి లోపు నూతన  టెండర్లు 
  • రానున్న మూడేళ్లలో అమరావతి అభివృద్ది పనులు అన్నీ పూర్తి
  • రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి, నవంబరు 4: అమరావతి అభివృద్ది పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను క్లోజ్ చేసే మార్గం సుగమం అయ్యిందని, త్వరలోనే నూతన టెండర్లను పిలిచే ప్రక్రియను  ప్రారంభించి రానున్న మూడేళ్లలో అమరావతి అభివృద్ది పనులను అన్నింటినీ పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.  సోమవారం రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు అధ్యక్షతన  39 వ సీఆర్డిఏ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగిందని… ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ది పనులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.  అమరావతి అభివృద్ది పనులకు సంబందించి 2014-19 మద్యకాలంలో రూ.41 వేల కోట్ల విలువైన టెండర్లను పిలిచి,  వాటిలో  దాదాపు రూ.35 వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.
వీటిలో  హైకోర్టు, అసెంబ్లీ భవనాలతో పాటు ప్రధాన రహదారులు,ఇతర రహదారులు, హైకోర్టు జడ్జిలు, మంత్రులు, అధికారుల వసతి గృహాల నిర్మాణాలకు సంబందించిన పలు పనులను చేపట్టడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వం  మూడు రాజధానులు అంటూ ఈ పనులన్నింటినీ నిర్వహించేందుకు ఏమాత్రము శ్రద్ద చూపకుండా వదిలేయడం జరిగిందన్నారు. పనులను ప్రారంభించిన పలు కాంట్రాక్టు ఏజన్సీలు నిర్వహించిన పనులకు కూడా బిల్లులను చెల్లించ కుండా పెద్ద ఎత్తున బకాయిలను పెట్టడం జరిగిందన్నారు. ఈ పాత టెండర్లకు సంబందించిన పలు సమస్యలను పరిష్కరించిన తదుపరే నూతన టెండర్లను పిలవాలనే ఉద్దేశ్యంతో పాత టెండర్లను క్లోజ్ చేసేందుకు విధి విధానాలను  రూపొందించేందుకై  చీఫ్ ఇంజనీర్లతో కూడిన సాంకేతిక కమిటీని  జూలై 24 న ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దాదాపు 23 పాయింట్లతో  అక్టోబరు 29 న ఆ కమిటీ ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగిందన్నారు.
నేటి సీఆర్డీఏ సమావేశంలో ఆ నివేదికపై పూర్తి స్థాయిలో చర్చించిన తదుపరి ఆమోదం తెల్పడం జరిగిందన్నారు. కమిటీ సిఫార్సు చేసిన 23 ప్రతిపాదనల ప్రకారం పాత టెండర్లను అన్నింటినీ క్లోజ్ చేసిన తదుపరి నూతన టెండర్లను పిలవడం జరుగుతుందన్నారు. హైకోర్టు, అసెంబ్లీ మినహా మిగతా పనులకు డిశంబరు 31 లోపు మరియు హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణాలకు జనవరి లోపు నూతన  టెండర్లను పిలవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రానున్న మూడేళ్లలో అమరావతి అభివృద్ది పనులు అన్నీ పూర్తి చేయడం జరుగుతుందని, ఐదేళ్లలో ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో అమరావతి ఒకటిగా విరాజిల్లుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అమరావతి అభివృద్ది పనులకు సంబందించి ప్రపంచ బ్యాంక్ రూ.15 వేల కోట్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపిందని, అయితే వరద నివారణా పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆ బ్యాంకు ప్రతినిధులు కోరడం జరిగిందన్నారు. అందుకు తగ్గట్టుగా అమరావతి రాజధాని 217  చ.కి. కోర్  క్యాపిటల్ పరిధిలోను మరియు బయట పలు చోట్ల రిజర్వాయర్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. క్యాపిటల్ సిటీ పరిధిలో కొండవీటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్ రిజర్వాయర్లను మరియు క్యాపిటల్ సిటీకి బయట నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరు మరియు ఉండవల్లి ప్రాంతాల్లో స్టోరేజ్ రిజర్వాయర్లను నెదర్లాండ్ డిజైన్ల ప్రకారం నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.అమరావతి చుట్టూ బైపాస్ రహదారులు నిర్మాణం జరుగుతున్నప్పటికీ గతంలో నిర్ణయించిన ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు,ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తామన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com