అధికారులను ఆదేశించిన సిఎం రేవంత్‌రెడ్డి
హ్యాండ్లూమ్స్, పవర్‌లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టిజిసిఓ)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగష్టు 15వ తేదీ తర్వాత అన్ని విభాగాల్లో యూనిఫాం ప్రోక్యూర్ చేసే వారితో సమావేశం నిర్వహించే ఏర్పాట్లు చేయాలని సిఎం ఆదేశించారు.
ఆర్టీసి, పోలీస్, హెల్త్ విభాగాల్లోనూ ప్రభుత్వ సంస్థల నుంచే క్లాత్‌ను తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. తద్వారా కార్మికులకు మరింత ఉపాధి కలుగుతుందని సిఎం పేర్కొన్నారు. మహిళా శక్తి గ్రూపు సభ్యులకు నాణ్యమైన క్వాలిటీతో డ్రెస్ కోడ్ కోసం ప్రత్యేక డిజైన్ రూపొందించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నిజమైన కార్మికుడికి లబ్ధి చేకూరేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సిఎం సూచించారు.