ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక మాంధ్య పరిస్థితుల ప్రభావం భారత స్టాక్మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా అమెరికాలో మాంద్యం, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం, చైనా ఆర్థిక వ్యవస్థపై అనుమానాలు, జపాన్ లో పెరిగిన వడ్డీరేట్లు, బ్రిటన్లో నిరుద్యోగం వంటి ఎన్నో ప్రతికూల అంశాలు భారత స్టాక్ మార్కెట్ ను ఒక్క కుదుపు కుదిపేశాయి. సోమవారం ఒక్క రోజే 15 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరైపోయింది. లాభాలే తప్ప నష్టాలు చూడని భారత రిటైలర్లకు ఇది కోలుకోలేని దెబ్బ అని చెబుతున్నారు. సోమవారం సెన్సెక్స్ 2వేల 222 పాయింట్ల నష్టంతో 78,759 వద్ద క్లోజ్ అయ్యింది. అటు నిఫ్టీ 662 పాయింట్లు పడిపోయి 24వేల 55 వద్ద నిలిచింది.
సుమారు మూడేళ్లుగా మన షేర్ మార్కెట్లో ఇంత పెద్ద కుదుపులు లేవనే చెప్పాలి. ఈస్థాయిలో షేర్స్ విలువలు పడిపోవడం కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన మధుపర్లకు ఏ మాత్రం అనుభవం లేదు. జపాన్ లో వడ్డీరేట్లు పెరగడం భారత స్టాక్ మార్కెట్లను షేక్ చేసింది. జపాన్ లో తక్కువ వడ్డీకి లోన్స్ తీసుకున్న జపాన్ ఇన్వెస్టర్లు, భారత్ సహా వివిధ దేశాల స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు అక్కడ వడ్డీరేట్లు పెంచడం, బాండ్ల ద్వారా కూడా పెద్దగా లాభాలు వచ్చే అవకాశం లేకపోవడంతో ఇండియన్ షేర్ మార్కెట్లో పెట్టిన ఇన్వెస్ట్ మెంట్స్ ను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా సోమవారం భారత స్టాక్ మార్కెట్లు కుదేలైపోయాయి.
మరోవైపు అమెరికా మరోసారి ఆర్ధిక మాంద్యంలోకి వెళ్తొందన్న సంకేతాలు కలవరపెడుతున్నాయి.అగ్ర రాజ్యంలో జులై నెలలో ఉద్యోగాల కల్పన అంచనాల కంటే తగ్గడంతో.. నిరుద్యోగం 4.3 శాతానికి పడిపోయింది. ఇప్పుడు ఇదే అమెరికా ఆర్ధిక మాంద్యానికి సంకేతం అని ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోవు రోజుల్లో ఫెడ్ వడ్డీరేట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న భయాలు నెలకొన్నాయి. ఈ అంశాలన్నింటితో అమెరికా మార్కెట్ల పతనం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపడంతో సోమవారం ఏకంగా 15 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి.