- కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు
- పరిష్కార మార్గాలను అన్వేషించాలన్న హైకోర్టు
- వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని సూచన
- వీధి కుక్కలను నియంత్రించేందుకు స్టెరిలైజ్ చేస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వం
జవహర్ నగర్‌లో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. కుక్కల దాడిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. శునకాల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని సూచించింది. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని వాదనల సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు వెల్లడించారు.
వాటన్నింటినీ సంరక్షణ కేంద్రాలకు తరలిం చడం సాధ్యం కాదన్నారు. రోడ్లపై వ్యర్థాల కారణంగా కుక్కల స్త్వ్రరవిహారం ఎక్కువైందని హైకోర్టు పేర్కొంది. వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరి శుభ్రంగా ఉంచాలని ఆదేశించింది. వీధి కుక్కలను నియంత్రించేందుకు స్టెరిలైజ్ చేస్తున్నట్లు ఎజి కోర్టుకు వెల్లడించారు. స్టెరిలైజ్ ద్వారా వీధి కుక్కల దాడులను ఎలా ఆపుతారని హైకో ర్టు ప్రశ్నించింది. కుక్కల దాడులను అరికట్టేందుకు ఆరు రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఎజి తెలిపారు.
జంతు సంక్షేమ కమిటీలతో రాష్ట్రస్థాయి కమిటీలు సమన్వయం చేసుకొని పరిష్కారం చూపాలని హైకోర్టు సూచించింది. ఆ కుక్కలను షెల్టర్ హోమ్స్ కి తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు న్యాయవాది సూచించారు. ఇలాగే నాగపూర్ లో దాదాపు 90 వేల కుక్కలను షెల్టర్ హోమ్ లో పెట్టినట్టు హైకోర్టుకు ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయి పరిష్కారం చూపాలని హైకోర్టు సూచించింది.
అయితే ప్రభుత్వం దృష్టి ధనవంతులు నివ సించే ప్రాంతాలపై కాకుండా సామాన్యులు నివసించే మురికివాడలపైనే ఉండాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యా నించింది. ఈ సమస్యను అధికారులు మానవీయ కోణంలో పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిని కేసుగా పరిగణించవద్దని, తక్షణమే చర్యలు తీసుకునేలా అధికారులు స్పందించాలని స్పష్టం చేశారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తు న్నామని, అప్పటిలోగా కుక్కల దాడుల నివారణకు తీసుకుంటున్న చర్యలు, కార్యాచరణ ప్రణాళికలను తెలియజేయాలని స్పష్టం చేసింది. అప్పటి కల్లా కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు మరిన్ని పరిష్కార మార్గాలతో రావాలని సూచించింది.
సిఎం రేవంత్ ఆదేశాలు
మరోవైపు కుక్కల దాడిలో బాలుడి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందన్నారు. భవిష్యత్తులో ఇటు వంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పలుమార్లు ఇలాంటి సంఘటన లు జరుగుతున్నందున వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశా లు జారీ చేశారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో కుక్కలు దాడులు చేస్తే తక్షణం అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు.