Wednesday, June 26, 2024

ఖరీఫ్‌సాగుకు సరిపడా విత్తనాలు సిద్దం

  • నకిలీలు అరికట్టేందుకు త్రీవ్రమైన చర్యలు
  • వ్యవసాయశాఖ కమీషనర్ డా.బి.గోపి

ఈ వానాకాలంలో అన్ని రకాల పంటల సాగుకు అవసరమైనన్ని విత్తనాలు, ఎరువుల్ని పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ బి. గోపి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ ముమ్మరంగా సాగుతోందని ఆయన వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన విత్తనమేళ 2024 ని ఆయన ప్రారంభించి ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

రైతుల డిమాండ్ కి అనుగుణంగా అన్ని జిల్లాల్లో ఆయా రకాల విత్తనాలని అందుబాటులో ఉంచడానికి రెండు నెలల నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని గోపి వివరించారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి ప్రభుత్వం చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటుందన్నారు. విత్తనాలు కొనుగోలు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొత్త టెక్నాలజీలు, సాగు విధానాలపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ’రైతు నేస్తం’ అనే కార్యక్రమంతో రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు, శాస్త్రవేత్తల మధ్య చర్చ కార్యక్రమాలని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నకిలీ విత్తనాలు వల్ల రైతులు నష్టపోయినప్పుడు తక్షణ నష్టపరిహారం అందించేందుకు వీలుగా విత్తన చట్టంలో సవరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. ఈ అంశాలపై అసెంబ్లీలో చర్చ జరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గోపి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాల్లో విత్తనాలను అందుబాటులో ఉంచామని రైతులు ఆందోళన చెందవద్దని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, పరిశోధన సంచాలకులు డాక్టర్ పి. రఘురామి రెడ్డి వివరించారు. సరైన విత్తనాలు, మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు మంచి దిగుబడులు, ఆదాయం వస్తుందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో సాగయ్యే ప్రధాన పంటలకి సంబంధించి నాణ్యమైన, మేలైన, తెగుళ్ళను తట్టుకోగలిగే అనేక రకాల విత్తనాల్ని విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చిందని వాటిని వినియోగించుకోవాలని రఘురాం రెడ్డి రైతులకి సూచించారు. ఈ సందర్భంగా రైతులకి విత్తనాలను పంపిణీ చేశారు. వివిధ పంటలకు సంబంధించి విశ్వవిద్యాలయం రూపొందించిన అనేక కరపత్రాలని సమావేశంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ సుధారాణి, విత్తన పరిశోధన సాంకేతిక సంస్థ సంచాలకులు డాక్టర్ పి. జగన్మోహన్ రావు, విత్తన ధ్రువీకరణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేశవులు, విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?

Most Popular