రోజు రోజుకు నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. పెద్దలే కాదు ఆఖరికి చిన్న పిల్లలు సైతం నేరప్రవృత్తి కనబరచడం ఆందోళన కలిగిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ దారుణ ఘటన భయాందోళన కలిగిస్తోంది. సెలవుల కోసం ఏకంగా ఓ స్కూల్ విద్యార్ధిని కొట్టి చంపిన ఘటన కలకలం రేపుతోంది. ఢిల్లీ సమీపంలోని దయాళ్‌పూర్ ప్రాంతంలో తలీముల్ ఖురాన్ మదర్సాలో చదువుకుంటున్న 9 నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్న ముగ్గురు విధ్యార్ధులు మదర్సాకు సెలవిస్తారని తోటి విధ్యార్ధిని కొట్టి చంపేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మదర్సా తలీముల్ ఖురాన్ నుంచి ఓ మహిళ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసింది. మదర్సాలో చదువుతున్న తన ఐదేళ్ల కొడుకు అనారోగ్యంతో ఉన్నాడని చెప్పింది. వెంటనే మదర్సా కు వచ్చిన పోలీసులు చిన్నారి మెడ, వీపు, నడుముపై గాయాలై నిస్తేజంగా పడి ఉండటాన్ని గమనించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చిన్నారిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఆ బాలుడి తల్లి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. చిన్నారి మృతికి కారణం వ్యాధి కాదని, శారీరకంగా దాడి చేయడం వల్ల అంతర్గతంగా తీవ్ర గాయాలయ్యాయని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. ఈ నివేదిక ఆధారంగా హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా మదర్సాలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో పాటు చిన్నారి స్నేహితులు, ఇతర విద్యార్థులతో మాట్లాడారు. మదర్సాలో కాస్స అనుమానాస్పద ప్రవర్తనతో ఉన్న మూగ్గురు అబ్బాయిలను గుర్తించారు పోలీసులు. వారిలో ఇద్దరు 11 ఏళ్లు, ఒకరు 9 ఏళ్ల విద్యార్థి ఉన్నాడు. తమదైన స్టైల్లో విచారించగా.. తామే బాలుడిపై దాడి చేసినట్లు ఒప్పుకున్నారు. టీవీలో చూసిన ఓ క్రైమ్ షో వల్లే తమకు సెలవు కావాలంటే దాడి చేయాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు.