మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ భార్య, దండకారణ్యం స్పెషల్ జోన్ డివిజనల్ కమిటీ సభ్యురాలు పుల్సం పద్మ అలియాస్ ఊరే అలియాస్ గంగక్క ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామానికి చెందిన పద్మ 1998లో సీపీఐ(ఎంఎల్) పీడబ్ల్యూజీలో చేరి పలు దళాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. 2005లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్‌ను పెళ్లి చేసుకున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగిన అనేక హింసాత్మక, ఎదురు కాల్పుల ఘటనల్లో పద్మ పాల్గొన్నారు. గతేడాది జులైలో ద్విచక్ర వాహనం పైనుంచి పద్మ పడటంతో ఆమె చేతికి తీవ్ర గాయం అయింది. తెలంగాణ ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలకు ఆకర్షితురాలై లొంగిపోయినట్లు తెలుస్తోంది. పద్మ పేరిట ఉన్న రివార్డును ఎస్పీ ఆమెకే అందజేశారు.
కాగా, మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ 2023లో గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ఆయన ఛత్తీస్‌గఢ్‌లోని అభుజ్‌మడ్ ప్రాంతంలో గుండెపోటుతో మరణించినట్లు పేర్కొన్నారు. ఆనంద్ స్వస్థలం తెలంగాణలోని మంచిర్యాల జిల్లా.