Friday, September 20, 2024

సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మంజూరైన బెయిల్‌కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి సంబందించిన ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టువలో విచారణ సందర్బంగా ధర్మాసనం రేవంత్ వ్యాఖ్యలను ప్రస్తావించింది.

ఓటుకు నోటు కేసుపై సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపధ్యంలో విచారణను తెలంగాణ రాష్ట్రం నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ పై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. విచారణను బదిలీ చేయడానికి ధర్మాసనం ముందు నిరాకరించినా.. నిష్పాక్షికతను చాటడానికి ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తామని స్పష్టం చేసింది.

ఈ కేసు విచారణ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి కవిత బేయిల్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ లతో కూడిన ధర్మాసనం ప్రస్తావించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటనలను ఈ రోజు పత్రికల్లో చదివాం.. బాధ్యతాయుతమైన సీఎం చేయాల్సిన వ్యాఖ్యలేనా అవి.. రాజకీయపార్టీలను సంప్రదించో.. లేక రాజకీయాంశాల ఆధారంగానో ఉత్తర్వులిస్తామా..ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడానికి అదే ప్రాతిపదిక అవుతుంది.. మేం రాజకీయపార్టీల గురించి, మా ఉత్తర్వులపై చేసే విమర్శల గురించి పట్టించుకోం.. ఆత్మప్రబోధానుసారం, చేసిన ప్రమాణం ప్రకారం విధులు నిర్వర్తిస్తాం.. అయితే కొందరు వ్యక్తుల దృక్పథం వారి తెంపరితనాన్ని ప్రతిబింబిస్తోంది.. అని రేవంత్ పై మండిపడింది కోర్టు.

అంతే కాకుండా.. సుప్రీంకోర్టు ఆదేశాలపై తలబిరుసుతనంతో వ్యాఖ్యలు చేసినందుకు మేం బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేశామని గుర్తు చేశారు జస్టిస్‌ బీఆర్‌ గవాయి. ధర్మాసనంలోని జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ స్పందిస్తూ.. వ్యవస్థలను పరస్పరం గౌరవించుకోవడం ప్రాథమిక విధి.. అందరూ సమానదూరం పాటిస్తూ గౌరవించుకోవాలి.. అని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు.

ముఖ్యమంత్రి చేసిన ప్రకటన గురించి చూశారా.. అని తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీని న్యాయమూర్తులు ప్రశ్నించారు. అందుకు ఆయన స్పందిస్తూ.. తానూ చూశానని, ఆ వ్యాఖ్యలు పూర్తిగా అవాంఛనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మరో సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను తప్పుగా కోట్‌ చేశారని, ఈ కేసులో ఎవరు లబ్ధిదారు అని మాత్రమే రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారని పేర్కొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos