- క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన ధర్మాసనం
- మరోమారు నోటీసులు ఇవ్వనున్న ఎసిబి
మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఈ నెల 8న ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
కేటీఆర్ పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వ్ల్గ• ధర్మాసనం విచారణ జరిపింది. దీంతో ఆయనకు ఇక ఎసిబి విచారణ తప్పదు. అలాగే అరెస్ట్ చేయడం కూడా ఖాయమని అంటున్నారు. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని.. ప్రస్తుతం కేటీఆర్ విపక్షంలో ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది సుందరం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేతగా ఉండటంతోనే కేసులు పెడుతున్నారని వాదించారు. అయితే.. ప్రతిపక్ష నేతగా ఉంటే కేసులు ఎదుర్కోవాలి కదా..? అని జస్టిస్ బేలా ఎం త్రివేది ప్రశ్నించారు.
హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. పిటిషన్ వెనక్కి తీసుకుని.. మళ్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరారు. పిటిషన్ విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించిన ధర్మాసనం.. మళ్లీ హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణలో భాగంగా కేటీఆర్ తరపున న్యాయవాది సిదార్థ వాదనలు వినిపించారు. ఈ ఫార్ములా కారు రేసు కేసులో హెచ్‌ఎండీఏను, ఇతరులను పేర్కొనలేదని కేవలం ఇద్దరు అధికారులను, కేటీఆర్‌ను మాత్రమే నిందితులుగా చేర్చారని కోర్టు ముందు ప్రస్తావించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు కేసు అని.. కేటీఆర్ ఒక్క రూపాయి తీసుకున్నారని ఎవరూ చెప్పడం లేదని న్యాయవాది తెలిపారు. ఇలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని 13(1)ఏ ఎలా వర్తిస్తుందని.. ఇందులో పీసీ యాక్ట్ 13(1ఎ) వర్తించనే వర్తించదని కేటీఆర్ తరపు న్యాయవాది వాదించారు. వెంటనే జోక్యం చేసుకున్న జస్టిస్ బేలా త్రివేది.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.
దీంతో ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు లో కాస్త ఊరట లభిస్తుందని భావించిన కేటీఆర్‌కు ఎదురుదెబ్బే తగిలింది. సుప్రీం నిర్ణయంతో ఈ కేసులో ఏసీబీకి మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. అయితే కేటీఆర్ కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంలో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. విచారణ సందర్భంగా ముందు తమ వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్‌ను ముందస్తుగానే దాఖలు చేసింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ నిరాకరణకు గురైనప్పటికీ.. సుప్రీం స్టే విధిస్తుందని కేటీఆర్ భావించినట్లు తెలుస్తోంది. కానీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌లో తాము జోక్యం చేసుకునేది లేదని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పడంతో ఏసీబీ మరోసారి నోటీసులు ఇస్తే ఆ విచారణకు కేటీఆర్ ఖచ్చితంగా హాజరుకావాల్సి ఉంటుంది.
గతంలో ఈ కేసుకు సంబంధించి కేటీఆర్‌ను దాదాపు ఎనిమిది గంటల పాటు ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీం కోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిన నేపథ్యంలో.. మాజీ మంత్రి అరెస్ట్ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌తో పాటు, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్‌ను ఈడీ, ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. వీరి నుంచి పలు కీలక సమాచారాన్ని ఏసీబీ, ఈడీ అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఆయనతోపాటు అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలకు మరో సారి నోటీసులు ఇచ్చే యోచనలో ఉంది. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో నోటీసులపై ఏసీబీ ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ముగ్గురిని ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే.