తెలంగాణ-, మహారాష్ట్ర సరిహద్దు గుండా గోదావరి ఉగ్రరూపంలో ప్రవహిస్తుండటంతో అంతరాష్ట్ర రహదారిని పోలీసులు మూసివేశారు. తెలంగాణ వైపు భారీకేడ్లు అడ్డం పెట్టి రాకపోకలను రెంజల్ పోలీసులు నియంత్రిస్తున్నారు. కందకుర్తి వద్ద అంతర్రాష్ట్ర ఫ్లైఓవర్ బ్రిడ్జిని తాకుతూ గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నందున ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇరు రాష్ట్రాలకు రాకపోకలను నిలిపివేశారు. కాగా, నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది.
మహారాష్ట్రలో అతి భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద ప్రవాహం తెలంగాణ వైపునకు కొనసాగుతోంది. దీనికి తోడుగా మంజీరాలోను వరద ప్రవాహం పుంజుకుంటుంది. త్రివేణి సంగమం నుంచి వస్తోన్న వరద ప్రవాహం అంతర్రాష్ట్ర ఫ్లైఓవర్ వద్ద గంటగంటకు భయానకంగా కనిపిస్తోంది. గోదావరి నదిలో చారిత్రక శివాలయం మునిగి పోయింది. భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.