బిలియనీర్ ముఖేశ్ అంబానీ కుమారుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ద్వారకకు కాలినడకన వెళ్తున్నారు. ఈ రెండు నగరాల మధ్య ఉన్న దూరం 140 కిలోమీటర్లకు పైనే. తన వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడొద్దనే ఉద్దేశంతో భారీ భద్రత మధ్య రాత్రివేళ నడక సాగిస్తున్నారు. ఏప్రిల్ 10న తన పుట్టిన రోజు నాటికి అనంత్ ద్వారకకు చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఈ సందర్భంగా ఆయన మంగళవారం తెల్లవారుజామున మీడియాతో మాట్లాడారు. జామ్‌నగర్‌లోని తమ ఇంటి నుంచి ద్వారక వరకు ప్రారంభమైన పాదయాత్ర గత ఐదు రోజులుగా కొనసాగుతోందని అనంత్ అంబానీ తెలిపారు. మరో నాలుగు రోజుల్లో ద్వారకకు చేరుకుంటామన్నారు. ద్వారకాధీశుడి ఆశీర్వాదం కోసం ఈ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. యువత ద్వారకాధీశుడుపై విశ్వాసం ఉంచాలన్నారు. ఏదైనా పని చేసే ముందు ద్వారకాధీశుడిని స్మరించుకోవాలని చెప్పారు. అప్పుడు ఆ పని కచ్చితంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుందని తెలిపారు. దేవుడు ఉన్నప్పుడు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనంత్ అంబానీ ఏఎన్ఐతో అన్నారు.