- సిఎం రేవంత్ ప్రచారంతో అభ్యర్థులకు అనుకూలం
- సుడిగాలి పర్యటనలతో పాటు బిజెపి ఎత్తుగడలను
- సమర్థవంతంగా ఎదుర్కొనేలా పిసిసి అధ్యక్షుడి వ్యూహాలు
- కేడర్ సరైన మార్గంలో వెళ్లేలా రేవంత్ దిశానిర్ధేశం
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి అధికార కాంగ్రెస్‌కు అధిక స్థానాలతో డబుల్ డిజిట్ వచ్చే అవకాశం ఉన్నట్లు పిసిసి వర్గాలు అంచనా వేస్తున్నాయి. బిజెపి ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయని భావించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో పాటు సీనియర్ నాయకులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేయడం, రామమందిరం నిర్మాణం, అక్షింతలు పంపిణీ లాంటివి బిజెపికి ఓటర్లను తెచ్చి పెట్టే అనుకూల అంశాలుగా మారినట్లు కాంగ్రెస్ అంచనా వేసింది. బిజెపి రాష్ట్రంలో తిష్ట వేస్తే రాష్ట్రానికి క్యాన్సర్ సోకినట్లేనని సిఎం తీవ్రంగా స్పందించారు. దీంతో బిజెపి ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు ధీటుగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం ప్రచారం నిర్వహించింది. అందులో భాగంగా బిజెపికి ఓట్లు వేస్తే రాజ్యాంగాన్ని సవరించి ఎస్సీ, ఎస్టీ, బిసిల రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న విషయాన్ని సిఎం రేవంత్ రెడ్డి జనంలోకి తీసుకెళ్లడంతో బిజెపికి అడ్డుకట్ట పడిందని పిసిసి వర్గాలు అంచనా వేస్తున్నాయి. బిజెపి, బిఆర్‌ఎస్‌లకు ధీటుగా సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు నిర్వహించడం కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశమని పిసిసి పేర్కొంటుంది.
అన్నీ తానై ప్రచార బాధ్యతలను చేపట్టిన సిఎం
పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలు చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో పిసిసి అధ్యక్షుడు, సిఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లింది. ఏప్రిల్ 6వ తేదీన తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఐదు న్యాయాలను తెలుగులో విడుదల చేయడంతో మొదలు పెట్టిన ప్రచారం ఈ నెల 11వ తేదీ వరకు నిర్వీరామంగా కొనసాగింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలను మంత్రులకు, సీనియర్ నాయకులకు ఇన్‌చార్జీలుగా నియమించి బాధ్యతలు అప్పగించింది. ఎక్కువ భాగం మంత్రులు, సీనియర్ నేతలు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు నెల రోజులుగా వారికి కేటాయించిన నియోజక వర్గాల్లోనే మకాం వేసి ప్రచారంతో పాటు నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలతో పాటు ప్రతి నియోజక వర్గంలో ఒకటి రెండు బహిరంగ సభలను నిర్వహించారు. సిఎం రేవంత్ రెడ్డి అన్నీతానై ప్రచార బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకొని ముందుకెళ్లారు.
28 రోజులు… 60కిపైగా సభల్లో రేవంత్
ఏప్రిల్ 6వ తేదీ నుంచి సిఎం రేవంత్ రెడ్డి 28 రోజుల్లో 60కిపైగా సభలు, కార్నర్ సమావేశాలు, రోడ్ షోలను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే డబుల్ డిజిట్ స్థానాలను కచ్చితంగా వస్తాయని, పదికి పైగా స్థానాలు వస్తాయని పిసిసి వర్గాలు భావిస్తున్నాయి. టికెట్లు ఇచ్చే విషయంలో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంలో అటు ఏఐసిసి, ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ తప్పిదాలు చేయడం వల్ల ఒకటిరెండు స్థానాలను చేజార్చుకోవాల్సి పరిస్థితి వచ్చిందన్న భావన కొందరు నాయకుల్లో వ్యక్తమవుతోంది. కానీ పార్టీపరంగా సిఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌లు పార్లమెంట్ నియోజక వర్గాల ఇన్‌ఛార్జీలుగా తమ బాధ్యతలను సమర్ధంగా నిర్విర్తించడం వల్ల తాజా రాజకీయ పరిస్థితుల్లో అధిక స్థానాలను చేజిక్కించుకుంటామని టిపిసిసి భావిస్తోంది.
బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారితో ప్లస్ పాయింట్
రాష్ట్రం ఏర్పాటైన తరువాత నుంచి ఇంత వరకు జరిగిన ఎన్నికలు ఒకఎత్తు ఇప్పుడు తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మరో ఎత్తుగా అధికార కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. బిఆర్‌ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు సిట్టింగ్ ఎంపిలు కాంగ్రెస్‌లోకి రావడం తమకు ప్లస్ పాయింట్‌గా కాంగ్రెస్ చెప్పుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు భారీగా జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపణలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్థం చేసినట్లు విమర్శలు చేయడంతో పాటు కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు అమలుకు శ్రీకారం చుట్టడం లాంటివి కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశాలని పిసిసి వర్గాలు పేర్కొంటున్నాయి.