న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 31 రాత్రి భారీగా సంబరాలు జరిగాయి. నగరంలోని ప్రతి ప్రాంతంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబం లేదా స్నేహితులతో పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో క్లబ్లులు పబ్ లలో మద్యం విక్రయాలు కూడా జోరుగా సాగాయి. కేవలం ఒక్క రోజులోనే అంటే డిసెంబర్ 30, 2024న రాష్ట్ర వ్యాప్తంగా 402 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం.. 3,82,265 కేసుల మద్యం, 3,96,114 కేసుల బీరు కేసులు మొత్తం 7.7 లక్షల కేసులు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 2024 రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో అత్యధికంగా 21 నుంచి 30 ఏళ్ల వయసు కలవారే ఉండడం గమనార్హం. నగరం మొత్తంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31, 2024 రాత్రి నుంచి జనవరి 1, 2025 ఉదయం వరకు మొత్తం 619 మందిని రాచకొండ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో అరెస్టు చేశారు. వీరిలో ఎక్కువగా 20 నుంచి 30 సంవత్సరాల వయసు లోపు ఉన్న యువకులే ఉన్నారు. అరెస్ట్ వారిలో వీరి సంఖ్య 262. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయిన 619లో ఇద్దరు మైనర్లు ఉండగా.. 50 ఏళ్లు పైబడిన వారు 33 మంది ఉన్నారని రాచకొండ పోలీసులు తెలిపారు. పోలీసుల జారీ చేసిన నివేదిక ప్రకారం.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో అరెస్టు అయిన వారిలో 18-20 ఏళ్ల వయస్సు గల వారు.. 12 మంది, 21-30 ఏళ్ల వయస్సు కలవారు 262 మంది, 31-40 ఏళ్ల వయస్సు గల వారు 201 మంది, 41-50 సంవత్సరాల వయస్సు ఉన్నవారు.. 109 మంది, 51-60 ఏళ్ల వయస్సు గల వారు 30 మంది, 61-70 వయసు గల సీనియర్ సిటిజెన్లు ముగ్గురు ఉన్నారు. ఈ జాబితా మహిళలు లేకపోవడం.. అందరూ పురుషులే ఉండడం గమనార్హం. మొత్తం 619 కేసుల్లో వాహనాల వారీగా చూస్తే.. పోలీసులు 526 టూ వీలర్లు (బైక్ లు), 26 తీ వీలర్లు (ఆటో రిక్షా), 64 ఫోర్ వీలర్ల (కార్లు, ట్రక్కులు) ను రాచకొండం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ జాబితాలో మూడ ట్రక్కులు ఉన్నాయి. ఎక్కువ శాతం కేసులు రాత్రి 1 గంట నుంచి ఉదయం 4 గంటల సమయంలో నమోదయ్యాయి. గత సంవత్సరం అంటే డిసెంబర్ 31, 2023న రాచకొండ పోలీసులు మొత్తం 431 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. కానీ అత్యధికంగా సైబరాబాద్ పోలీసులు 938 కేసులు నమోదు చేశారు.