ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో మార్చి నెలాఖరుకు మరో రూ. 600కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే జీహెచ్‌ఎంసీ రెవెన్యూ విభాగం ఇప్పటికే 6లక్షల మంది యజమానులకు నోటీసులను జారీ చేసింది. ట్రేడ్ లైసెన్సులు తీసుకోని వారికి, గతంలోని లైసెన్సులు రెన్యువల్ చేసుకోని వారికి మరో లక్షన్నర నోటీసులును జారీ చేసింది. అంతటితో అధికారులు ఆగలేదు. మొండి బకాయిలున్న ప్రైవేటు హాస్పిటళ్లు, రెస్టారెంట్లు, విద్యా సంస్థలు, హోటళ్లు, ఇతరత్రా వ్యాపార సముదాయాలకు తాళం వేయాలని నిర్ణయించారు. గడిచిన వారం రోజుల్లో 100 భవనాలకు తాళం వేశారు.
ప్రస్తుతం శేరిలింగంపల్లి జోన్ పరిధిలో ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవు. బహుళ అంతస్తులు, వ్యాపార సంస్థలున్న హైటెక్‌సిటీ, మాదాపూర్, చందానగర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్ ప్రాంతాల్లో బకాయిదారులను సంప్రదించి, ట్యాక్స్ వసూలుపై అధికారులు దృష్టి పెట్టడం లేదని కేంద్ర కార్యాలయం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఆస్తి పన్ను బకాయి 5లక్షల రూపాయలకు మించి ఉన్న భవనాలు 4వేలకుపైగా ఉన్నాయి. ఇలాంటివి అత్యధికంగా జూబ్లిహిల్స్ సర్కిల్‌లో 700 నిర్మాణాలు, ఖైరతాబాద్‌లో 650, గోషామహల్‌లో 550, బేగంపేటలో 280, సరూర్‌నగర్‌లో 180, అంబర్‌పేట్‌లో 140, మెహిదీపట్నంలో 150 ఉన్నాయి. వాటి నుంచి రూ.4వేల కోట్ల ట్యాక్స్ వసూలు కావాల్సి ఉందని అంచనా ఉంది. అందులో చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. పంజాగుట్టలోని ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రి రూ.55కోట్లు, బంజారహిల్స్‌లో రోడ్డు నెం.12లోని ప్రభుత్వ ఆఫీసు రూ.కోట్లలో ఆస్తిపన్ను బకాయి పడ్డాయి.
2 ఏళ్లు వరుసగా చెల్లించి, ఈ ఏడాది చెల్లించని భవనాలు 3,09,000 ఉన్నాయి
వాటి నుంచి జీహెచ్‌ఎంసీకి పన్ను రూపంలో రావాల్సినవి రూ.600 కోట్లు
రూ.5 లక్షలకు మించి బకాయిలున్న నిర్మాణాలు 4,500
బకాయిదారులకు జారీ చేసిన నోటీసులు 6,34,552
వాటి నుంచి వసూలు కావాల్సిన మొత్తం రూ.3,500 కోట్లు