ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు.. కానీ ఇది నిజం! సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను ఇప్పుడు మ్యారీడ్! తాప్సీ తన దీర్ఘకాల భాగస్వామి డానిష్ బ్యాడ్మింటన్ కోచ్ మథియాస్ బోను పెళ్లాడారు. ఈ శనివారం (23 మార్చి) నాడు అత్యంత రహస్యంగా జరిగిన ఈ వివాహానికి కొద్దిమంది కుటుంబ సభ్యులు, బాలీవుడ్ స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. 10 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరూ ఉదయపూర్‌ను తమ వివాహ వేదికగా ఎంచుకున్నారు. వివాహవేడుకను పూర్తి ప్రయివేట్ వ్యవహారంగా ఉంచారు. గత వారం వివాహానికి ముందస్తు వేడుకలు ప్రారంభమయ్యాయి. మీడియా హంగామా లేకుండా గోప్యత కోసం మాత్రమే ఈ జంట పెళ్లి విషయాన్ని చెప్పకుండా దాచింది.
ఒక సన్నిహిత వ్యక్తి సమాచారం మేరకు ”వీరిద్దరూ చాలా ప్రైవేట్ – రిజర్వుడ్ వ్యక్తులు.. అందుకే ప్రచారం కోరుకోలేదు”అని సోర్స్ చెబుతోంది. అతి కొద్ది మంది సన్నిహిత బాలీవుడ్ ప్రముఖులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. తాప్సీ స్నేహితుడు, దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ ఉన్నారు. అనురాగ్ కశ్యప్ తాప్సీ పన్నుకు చాలా కాలంగా స్నేహితుడు. తాప్సీ నటించిన ‘మన్మర్జియాన్’కు దర్శకత్వం వహించారు. నిర్మాత-రచయిత కనికా ధిల్లాన్, ఆమె భర్త హిమాన్షు శర్మ తదితర ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు.