ఇటీవల హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరుపుతున్న దాడుల్లో పలు ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లు కూడా పరిశుభ్రతను, ఆహార పదార్థాల నాణ్యతను పాటించకపోవడం లాంటి విషయాలు బయటపడిన విషయం తెలిసిందే. గడువు తీరిపోయిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రత, కుళ్లిపోయిన మాంసాన్ని బిర్యానీ, ఇతర ఆహార పదార్థాల తయారీకి ఉపయోగించడం లాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు, రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే బిర్యానీల్లో బొద్దింకలు, ఇతర పురుగులు, చిన్నపాటి ప్లాస్టిక్ వస్తువులు రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా, హైదరాబాద్ నగరంలో బిర్యానీకి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బావర్చి హోటల్‌లో ఓ కస్టమర్‌కు వడ్డించిన బిర్యానీలో టాబ్లెట్లు రావడం సంచలనంగా మారింది.
బిర్యానీలో టాబ్లెట్ రావడంతో హోటల్ యాజమాన్యాన్ని నిలదీశాడు కస్టమర్. అయితే, యాజమాన్యం కస్టమర్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా.. టాబ్లెట్ తీసేసి తినమని ఉచిత సలహా ఇచ్చింది. దీంతో సదరు కస్టమర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే, హోటల్ యాజమాన్యం అతడ్ని వీడియో తీయొద్దంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అయినప్పటికీ ఆ కస్టమర్ బిర్యానీలో వచ్చిన టాబ్లెట్‌కు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ దృశ్యాలను చూసిన నెటిజన్లు హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారంటూ మండిపడ్డారు. సదరు హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అసలు ఆ టాబ్లెట్ ఏ ఉద్దేశంతో బిర్యానీలో వేశారో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, ఇటీవల ఓ హోటల్‌లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందగా.. 50 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ హోటల్ పై అధికారులు చర్యలు తీసుకున్నారు. నగరంలోని చాలా హోటల్లు కూడా కస్టమర్లకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడం లేదని ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో తేలిపోయింది. దీంతో ప్రజలు హోటల్లు, రెస్టారెంట్లకు వెళ్లి తినాలంటనేనే భయపడే పరిస్థితికి వస్తున్నారు.