మన సమాజంలో రకరకాల వ్యక్తులుంటారు. అందులో సెలబ్రెటీలను అభిమానించేవారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినీ, క్రీడా, రాజకీయ రంగ ప్రముఖుల్లో కొంత మందికి ఆలయాలు నిర్మించిన ఘటనలు మనం చాలా చూశాము. మరీ ముఖ్యంగా సినిమా రంగంలో హీరో హీరోయిన్లలో కొంత మంది విగ్రహాలతో గుడులు కట్టించి పూజలు చేస్తున్న అభిమానులను చూస్తున్నాము. ఐతే తమిళనాడులోని ఓ వ్యక్తి మాత్రం ఏ మాత్రం తెలియని వారి కోసం గుడి కట్టి పూజలు చేస్తుండటం ఆసక్తిరేపుతోంది.
తమిళనాడులో ఏకంగా గ్రహాంతరవాసికి గడి కట్టి పూజలు చేస్తున్న ఘటన చర్చనీయాంశమవుతోంది. సేలం జిల్లాలో మల్లమూప్పన్ పట్టి సమీపంలోని రామగౌండనూర్ కు చెందిన సిద్ధర్ భాగ్య స్థానికంగా ఓ శివుని గుడిని నిర్మించారు. ఆ ఆలయంలో మూలమూర్తిగా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ పక్కనే ఓ మండపంలో అగస్త్య మహర్షి, మరో మండపంలో గ్రహాంతరవాసి విగ్రహాలు ప్రతిష్ఠించారు. దేవుళ్లతో పాటు గ్రహాంతర వాసి విగ్రహానికి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు.
శివాలయానికి వచ్చే భక్తులు గ్రహాంతరవాసికి పూజలు చేయడాన్ని ఆసక్తిగా, వింతగా చూస్తున్నారు. శివుడు ప్రపంచాన్ని సృష్టించిన తరువాత గ్రహాంతరవాసులు పుట్టారని గ్రహాంతరవాసి విగ్రహాన్ని ప్రతిష్టించిన సిద్ధర్ భాగ్య చెబుతున్నారు. ఈ విషయాన్ని అగస్త్య మహర్షి రాసిన గ్రంథాలలో చెప్పారని అతనంటున్నాడు. ఏదేమైనా ఇలా గ్రహాంతరవాసికి గుడి కట్టి పూజలు చేయడం మాత్రం సంచలనం రేపుతోంది.