శాసనసభ సమావేశాలకు హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ఇటీవల పలు సభలు, సమావేశాల సందర్భంగా ఇదే విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ఒకరిద్దరు మినహా అందరికన్నా కెసిఆర్ సీనియరే కాకుండా, కేంద్రమంత్రిగా, డిప్యూటి స్పీకర్‌గా, ముఖ్యమంత్రిగా పాలనలో ఆపార అనుభవస్థుడు.. అందుకే ప్రభుత్వ వ్యవహారాల్లో పెద్దగా అనుభవం లేని తమకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకైనా ఆయన అసెంబ్లీకి రావాలని రేవంత్‌రెడ్డి పదేపదే కోరడం వెనుక మతలబేంటన్నది ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చజరుగుతున్నది. ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం నాయకుడిగా కొనసాగుతున్న క్రమంలో వోటుకు నోటు కేసుతో కెసిఆర్‌తో రేవంత్‌రెడ్డికి మధ్య ఉప్పులో నిప్పులా తయారైంది. అనంతరం రాజకీయాల్లో వొచ్చిన మార్పుతో రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రకాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు. గత ఎన్నికల్లో కెసిఆర్ ఓటమే లక్ష్యంగా రాజకీయ పోరాటంచేసి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించింది మొదలు ప్రతీ అంశంలో కెసిఆర్‌ను టార్గెట్ చేస్తూ వొస్తున్నారు.
కెసిఆర్‌తోపాటు బిఆర్‌ఎస్‌పార్టీని తెలంగాణలో మళ్ళీ మొలవనీ యకుండా చేస్తానంటూ ఆయన శపథం చేసిన విషయం తెలియంది కాదు. కాగా కెసిఆర్ ముఖ్యమంత్రిగా బిఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాల్లోని లోపాలను ఎత్తిచూపడం ద్వారా ప్రజాసొమ్మును కెసిఆర్ బృందం ఏమేరకు దుర్వినియోగం చేసిందన్న విషయాన్ని ప్రజలకు వివరించే విషయంలో ఆయన శక్తియుక్తులన్నిటిని వినియోగిస్తున్నారు. అయితే ఇంతవరకు కెసిఆర్ మీద, ఆయన పాలనపైన పరోక్షంగా దాడి చేస్తుండడం సిఎం రేవంత్‌రెడ్డికి పెద్దగా సంతృప్తిని కలిగిస్తున్నట్లుగాలేదు. ఆయనను ఏవిధంగానైనా అసెంబ్లీకి రప్పించి తనలోఉన్న ఆక్రోశాన్నంతా వెళ్ళగక్కి కడిగిపారేయాలన్నదే ఆయన ఆకాంక్షగా కనిపిస్తున్నదన్న వాదన రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తున్నది. 2023లో జరిగిన అసెంబ్లీ ఫలితాలు బిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వొచ్చాయి. ఆ ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామాను సమర్పించిన కెసిఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాం హౌజ్‌కే పరిమితమయ్యారు. చాలా రోజుల వరకు ఫాంహౌజ్‌లో కూడా ఎవరిని కలవకుండా ఏకాంతంగా గడిపారంటారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి బడ్జెట్ సమావేశానికి హాజరై అందరినీ ఆశ్చర్యపర్చారు.
అయితే అది ఒక్క రోజుకే పరిమితమైంది. ఆనాటినుండి కెటిఆర్, హరీష్‌రావులే అంతా తామేఅయ్యి పార్టీవ్యవహారాలను నడిపిస్తున్నారు. గత బిఆర్‌ఎస్ పాలనా తీరుపైన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్‌రెడ్డి చేస్తున్న మాటల దాడికి, ఛాలెంజీలకు, షరతులకు వారిద్దరే సమాధానం చెపుతూవొస్తున్నారు. వారిపైన చేస్తున్న విమర్శలు పిచుకమీద బ్రహ్మాస్త్రంగా రేవంత్‌రెడ్డికి అనుపిస్తున్నట్లుంది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు అసలైన నాయకుడి పైన తన ప్రభావం చూపించాలన్న ఉద్దేశ్యంగానే అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూ కెసిఆర్‌కు రేవంత్‌రెడ్డి పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈనెల 9వ తేదీ నుండి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ఎట్టి పరిస్థితిలో కెసిఆర్‌ను రప్పించాలన్నది రేవంత్‌రెడ్డి పట్టుదలగా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక విధంగా రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్న విషయం గమనార్హం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వొచ్చి ఈనెల ఏడవతేదీతో సంవత్సరకాలం పూర్తికావస్తున్నది.
ఈ ఏడాది కాలంలో తాము విజయవంతంగా నిర్వహించిన కార్యక్రమాలపై ఇప్పటికే ‘ప్రజాపాలన-విజయోత్సవాల’పేర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. తొమ్మిదవ తేదీన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌పార్టీ ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీ ల పైన తీవ్రస్థాయిలో చర్చ జరుగనుంది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మేరకు వందరోజుల్లో అమలు పరుస్తామన్న ఆరుగ్యారంటీలను నెరవేర్చలేకపోయిందంటూ బిఆర్‌ఎస్, బిజేపితో సహా ఇతర రాజకీయపార్టీలు విమర్శిస్తున్నాయి. ప్రధానంగా రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన, రైతు భరోసా, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అంశాలతోపాటు లగచర్ల ఘటన, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అంశాలు ప్రధానంగా చర్చకు వొచ్చే అవకాశాలున్నాయి.
ఈ అంశాలపై ఇప్పటికే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. తమ పథకాలను విమర్శిస్తున్న క్రమంలో సరైన సలహాలిచ్చేందుకైనా అసెంబ్లీకి రావాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు రేవంత్‌రెడ్డి. అసెంబ్లీలో సిఎంకు ఎంత గౌరవముంటుందో ప్రతిపక్ష నేతకు కూడా అంతే ఉంటుందన్న విషయాన్ని మరిచిపోరాదని గుర్తుచేస్తున్నారు. అసెంబ్లీ అంటే కాంగ్రెస్‌కు చెందిన 64మంది ఎమ్మెల్యేలు మాత్రమేకాదు, 119మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వమవుతుంది. అందుకే విపక్షనాయకుడిగా తనకున్న పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలంటున్న రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిని ఈసారైనా కెసిఆర్ పాటిస్తారా లేదా తెలియదు. తమిళనాడులో జయలలిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు తాము ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెడుతామంటూ శపథం చేసినట్లు కెసిఆర్ అయితే చేయలేదుకాని, సభాపక్షనాయకుడిగా రేవంత్‌రెడ్డి ఉన్నంతవరకు సభలో కూర్చునేందుకు ఆయన మనస్సు అంగీకరించడం లేదన్న ప్రచారం మాత్రం జరుగుతున్నది.